కృష్ణా నది వరద నీటి వాడకంపై ఏపీ పాతపాట

కృష్ణా నది వరద నీటి వాడకంపై ఏపీ పాతపాట

ఆ 90 టీఎంసీలను లెక్కించొద్దు

కేఆర్‌ ఎంబీకి తేల్చిచెప్పిన ఏపీ
వరద రోజుల్లో నీటి వాడకంపై పాత పాట
ఈనెలాఖరు వరకు 46 టీఎంసీలు ఇవ్వాలని ఇండెంట్‌

హైదరాబాద్‌‌, వెలుగు: కృష్ణా నదిలో వరద పోటెత్తి, ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తి నీటిని సముద్రంలోకి వదిలేసిన రోజుల్లో 90.30 టీఎంసీలు వాడుకున్నామని ఆ నీటిని వినియోగం లెక్కల్లో చేర్చవద్దని ఏపీ తేల్చిచెప్పింది. ఏపీ ఇరిగేషన్‌‌ ఈఎన్సీ నారాయణరెడ్డి బుధవారం కేఆర్‌‌ఎంబీ మెంబర్‌‌ సెక్రటరీ డీఎం రాయ్‌‌పురేకు లెటర్‌‌ రాశారు. ఈనెల ఏడో తేదీ వరకు తమ రాష్ట్రం వివిధ ఔట్‌‌లెట్ల నుంచి 318.10 టీఎంసీల నీటిని వినియోగించుకుందని తెలిపారు. ఈ యేడాది కృష్ణా నదికి పెద్ద ఎత్తున వరదలు వచ్చాయని, ఆగస్టు 22 నుంచి నవంబర్‌‌ ఒకటో తేదీ మధ్య వరుసగా 50 రోజుల పాటు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారని పేర్కొన్నారు.

ఆ రోజుల్లో తాము ఉపయోగించుకున్న నీటిని మినహాయిస్తే 227.83 టీఎంసీలను తమ వినియోగంగా లెక్కించాలని పేర్కొన్నారు. ఔట్‌‌లెట్ల వారీగా ఎంత నీటిని మినహాయించాలనే విషయాన్ని ఏపీ ఈఎన్సీనే తేల్చిచెప్పడం గమనార్హం.

 

ఇంకో 46 టీఎంసీలు ఇవ్వండి

డిసెంబర్‌‌ నెలాఖరు వరకు తమ రాష్ట్రానికి ఇంకో 46 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు రిలీజ్‌‌ ఆర్డర్‌‌ ఇవ్వాలని లెటర్​లో కోరారు. నాగార్జునసాగర్‌‌ కుడి కాలువకు 20, ఎడమ కాలువకు 5, పోతిరెడ్డిపాడు, హెచ్‌‌ఎన్‌‌ఎస్‌‌ఎస్‌‌కు 4 చొప్పుల, కృష్ణా డెల్టా సిస్టంకు 13 టీఎంసీలు ఇవ్వాలని కోరింది. తాము గతంలో ఇచ్చిన ఇండెంట్‌‌లో 216 టీఎంసీలు ఇవ్వాలని కోరామని తెలిపారు.

పోతిరెడ్డిపాడు నుంచే 118 టీఎంసీలు

ఏపీ ఒక్క పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ ద్వారానే 118.26 టీఎంసీల నీటిని తరలించుకుంది. ఇందులో 76.87 టీఎంసీలను వినియోగంగా లెక్కించాలని, 41.39 టీఎంసీలు మినహాయించాలని కోరింది. హెచ్‌‌ఎన్‌‌ఎస్‌‌ నుంచి 7.12, కృష్ణా డెల్టా సిస్టం నుంచి 3.26, సాగర్‌‌ కుడి కాలువ నుంచి 33.30, ఎడమ కాలువ నుంచి 5.23 టీఎంసీలను లెక్కించొద్దని కోరారు.

 

తెలంగాణ వినియోగం 54 టీఎంసీలే..

శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌ నుంచి ఈ యేడాది ఇప్పటి వరకు తెలంగాణ 54.07 టీఎంసీలను మాత్రమే ఉపయోగించుకుంది. ఇందులో ప్రాజెక్టులు సర్‌‌ ప్లస్‌‌ అయిన రోజుల్లో రాష్ట్ర వినియోగం 18 టీఎంసీలు మాత్రమే. నాగార్జునసాగర్‌‌ ఎడమ కాలువ ద్వారా 31.62, ఏఎమ్మార్పీకి 14, హైదరాబాద్‌‌ తాగునీటికి 8.43, కల్వకుర్తి నుంచి 6.48 టీఎంసీలను ఉపయోగించుకుంది. జూరాల ప్రాజెక్టు ద్వారా 15.41, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌‌సాగర్‌‌ లిఫ్టుల ద్వారా 14.42 టీఎంసీల నీటిని తరలించారు. మీడియం ఇరిగేషన్‌‌ ప్రాజెక్టులను కూడా లెక్కలోకి తీసుకుంటే తెలంగాణ ఇప్పటి వరకు 101 టీఎంసీలు ఉపయోగించుకోగా, ఏపీ 374.30 టీఎంసీలను తరలించుకుంది.