ఏపీలో ఎన్నికల రద్దుపై హైకోర్టులో ఎస్ఈసీ పిటిషన్

 ఏపీలో ఎన్నికల రద్దుపై హైకోర్టులో ఎస్ఈసీ పిటిషన్
  • సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసిన ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని
     

అమరావతి: సుప్రీంకోర్టు నిబంధనలు పాటించకుండా జరిపిన ఎన్నికలు చెల్లవంటూ ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు సహేతుకం కాదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ డివిజన్ బెంచ్ కు అప్పీలు చేసుకున్నారు. రాష్ట్రంలో గత ఏప్రిల్ లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గత ఏప్రిల్ 1న ఇచ్చిన నోటిఫికేషన్ ను హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్ జారీ చేశారని హైకోర్టు ఇచ్చిన తీర్పు  కలకలం రేపింది. పోలింగ్ కు నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని.. హైకోర్టు అభిప్రాయపడింది. ఎన్నికలకు రూ.160 కోట్లు ఖర్చు చేశామన్న ఎన్నికల కమిషనర్ వాదన చూస్తుంటే.. చట్టవిరుద్ధంగా జరిగిన చర్యను సక్రమం చేయమని అడుగుతున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించడం ఎన్నికల కమిషన్ కు పెద్ద దెబ్బ. ఈ ఆదేశాలపై ఎన్నికల కమిషనర్ డివిజన్ బెంచ్ కు అప్పీలు చేసుకున్నారు.