న్యూయార్క్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థిని అనారోగ్యంతో అమెరికాలో మృతి చెందారు. బాపట్ల జిల్లా కారంచేడు గ్రామానికి చెందిన 23 ఏండ్ల యార్లగడ్డ రాజేశ్వరి కొంతకాలంగా దగ్గు, ఛాతీనొప్పితో బాధపడుతున్నారు. ఇప్పటికే టెక్సస్‌లోని ఏ అండ్ ఎం యూనివర్సిటీ నుంచి ఎంఎస్ కంప్యూటర్స్ పూర్తిచేసిన రాజేశ్వరి.. కొద్దిరోజులుగా స్నేహితులతో కలిసి ఉద్యోగం కోసం వెతుకుతున్నారు.
అయితే, రెండుమూడు రోజులుగా తీవ్ర దగ్గు, ఛాతినొప్పి వస్తుండటంతో డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నట్లు ఫోన్‌లో తన కుటుంబ సభ్యులకు తెలిపారు. అదేరోజు రాత్రి ఫ్రెండ్స్‌తో కలిసి నిద్రపోయిన రాజేశ్వరిని ఉదయం నిద్రలేపగా కదలికలు లేకుండా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రాజేశ్వరి ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరణానికి కారణం తెలుసుకునేందుకు పోస్ట్‌మార్టానికి తరలించారని అక్కడి ఇండియన్ కమ్యూనిటీ వెల్లడించింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఇంజినీరింగ్ చదివిన రాజేశ్వరిది సాధారణ వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో రాజేశ్వరి మృతదేహాన్ని ఆమె సొంతూరుకు తరలించేందుకు అమెరికాలోని స్నేహితులు నిధులు సేకరిస్తున్నారు.
