సీపీఎస్ రద్దు కోసం ఉద్యమించిన ఏపీ ఉపాధ్యాయులు

 సీపీఎస్ రద్దు కోసం ఉద్యమించిన ఏపీ ఉపాధ్యాయులు
  • రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శనలు, ధర్నాలు
     

అమరావతి: సీపీఎస్ ను  రద్దుచేయాలని ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యోగ సంఘాలు బుధవారం పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశాయి. భారీ నిరసన ప్రదర్శనల అనంతరం ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ ను రద్దు చేయాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. 
ఆయా ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్లో ఫ్యాప్టో ఛైర్మన్ జె.సుధాకర్, ఏపీ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ జి.హృదయ రాజు, రాష్ట్ర ఫ్యాప్టో సెక్రెటరీ కె. ప్రకాశ్ రావు తదితరులు మాట్లడుతూ గత ఎన్నికల ముందు అధికారమిస్తే వారం రోజుల్లో సి పి ఎస్ రద్దు చేస్తాను అని హామీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి సగం పదవీ కాలం అయిపోవచ్చినా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సి పి ఎస్ విధానం వలన ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ఉద్యోగికి ఇచ్చే ఈ పెన్షన్ విధానము జీవితంలో ఖర్చులకు ఏ మాత్రం సరిపోని విధంగా నామమాత్రంగా వుందని గుర్తించాలన్నారు. ఫ్యాప్టో వేదిక సీపీఎస్ అమల్లోకి వచ్చిన 2004 సెప్టెంబర్ 1 నుండి ప్రభుత్వంతో పోరాడుతూ అనేక ఉద్యమాలు చేయటం వలన గత ప్రభుత్వంలో గ్రాట్యుటి, ఫ్యామిలీ పెన్షన్ ను సంపాదించుకోగలిగామని తెలిపారు. సి పి ఎస్ రద్దు కొరకు ప్రభుత్వం పై ఉద్యమాలు కొనసాగిస్తామని, సీఎం ఇచ్చిన హామీ అమలు అయ్యేంతవరకు, సి పి ఎస్ విధానం రద్దు అయ్యే వరకు మా పోరాటాలను ఆపబోమని ప్రకటించారు.
ప్రభుత్వం ఇప్పటికైనా చట్టబద్దమైన డిమాండ్లు తీర్చాలి 
ఫ్యాప్టో పరిశీలకులు  హెచ్.తిమ్మన్న, యూటీఎఫ్ రాష్ట్ర ఉపాద్యక్షుడు సురేష్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ఫ్యాప్టో ఎల్లప్పుడూ ఉపాధ్యాయ మరియు ఉద్యోగుల పక్షాన ప్రభుత్వంతో పోరాడుతుంది కానీ ప్రభుత్వానికి మరి ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదన్నారు. ఉద్యోగులకు సంబందించినంత వరకు పెన్షన్, డి ఏ లు మరియు పి ఆర్ సి అనేవి చట్టబద్ధమైనవని, ప్రభుత్వం వాటిని కొంతకాలం అపవచ్చు కానీ నిరవధికంగా ఆపలేదు అని , కొంత కాలం ఆపటం వలన ప్రభుత్వంనకు ఉద్యోగ వర్గాల్లో అప్రతిష్ట మరియు చెడ్డ పేరు వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వ నేతలు ఇప్పటికైనా కళ్ళు తెరచి ఉద్యోగులు కోరే చట్ట బద్ధమైన న్యాయ పరమైన కోరికలు తీర్చాలని డిమాండ్ చేయటం జరిగిందన్నారు. ఈ రోజు ఫ్యాప్టో పిలుపునకు స్పందించి జిల్లా వ్యాప్తంగా వేయి మందికి పైగా ఉపాద్యాయులు మరియు ఉద్యోగులు సెలవు పెట్టుకొని హాజరు అయ్యారని,  వీరిలో సి పి ఎస్ పరిధిలో కి వచ్చే వారు, రాని వారు కూడా హాజరయ్యారని చెప్పారు.
వివిధ జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో డి టి ఎఫ్ రాష్ట్ర నాయకులు రత్నం ఏసేపు , బి టి ఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  ఆనంద్ , ఎస్ టి యు నాయకులు గోకారి ,  శివయ్య, బి.మాధవ స్వామి, కమలాకర రావు, మహిళా నాయకురాళ్లు శ్రీమతి నాగమణి, హెచ్ ఎంల సంఘం నాయకులు ఓంకార్ యాదవ్, నారాయణ , అప్టా అధ్యక్షుడు మునగాల మధు సుధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి  సేవా నాయక్,  డి టి ఎఫ్ నాయకులు కృష్ణ , ప్రధాన కార్యదర్శి  గట్టు తిమ్మప్ప ,  బి టి ఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భాస్కర్, సుధాకర్, ఎల్లప్ప తదితరులు  ప్రసంగించారు. ర్యాలీలు, బహిరంగ సభల్లో  యందు ఏపీ ఎన్జీవో నాయకులు,  ఏపీ ప్రభుత్వ నర్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి శాంతి భవాని, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ అసోసియేషన్ నాయకులు మద్దిలేటి , ఆర్ యూ పీపీ నాయకులు రఘు ,పి ఈ టి అసోసియేషన్ నాయకులు వెంకటేశ్వరులు,  సీఐటీయూ నాయకులు గౌస్ దేశాయ్ , ఏఐటీయూసీ నాయకులు మునెప్ప, ఎన్జీవో వెటర్నరీ ఉద్యోగుల సంఘ నాయకులు సుబ్బారాయుడు పాల్గొని మద్దతు, సంఘీభావం ప్రకటించారు.