ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేన మాటల యుద్ధం

ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేన మాటల యుద్ధం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి పవన్ కామెంట్స్ తో  జనసేన, వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రెండు పార్టీల నేతలు సవాల్ కు ప్రతి సవాల్ విసురుకుంటున్నారు. వైసీపీని టార్గెట్ గా చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామన్నారు. జగన్ ప్రభుత్వాన్ని  గద్దె దించేందుకు వ్యతిరేక శక్తులను ఏకం చేస్తామని ప్రకటించారు. మంత్రి అంబటి రాంబాబు కాపుల గుండెల్లో కుంపటి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పవన్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి దీటుగా స్పందించారు. తాను 2 లక్షల లంచం తీసుకున్నాని నిరూపిస్తే మంత్రి పదవికే రాజీనామా చేస్తానని అంబటి రాంబాబు విసిరారు. 

ఏ జిల్లాలోనూ రైతులు సంతోషంగా లేరు: పవన్ కళ్యాణ్

రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ రైతులు సంతోషంగా లేరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా ధూళిపాళ్లలో జనసేన కౌలురైతు భరోసా యాత్రలో పాల్గొన్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, పాలన తీరుపై విరుచుకుపడ్డారు. నష్టపోయిన కౌలురైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సాయం చేశారు. రాష్ట్రంలో అన్నదాతల కష్టాలను పట్టించుకునే అధికారులే లేరని పవన్ కల్యాణ్ అన్నారు. 

 ప్రజలను బెదిరించడానికి, ప్రతిపక్షాల సభలను అడ్డుకోవటానికి మాత్రం వస్తారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు దోపిడీ చేస్తున్నారని.. ఎన్నికలు దగ్గరకి వచ్చాయి కాబట్టి అవినీతికి వైసీసీ హాలీడే ప్రకటించిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. మంత్రి అంబటి రాంబాబు  కాపుల గుండెల్లో కుంపటి పెట్టారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. సత్తెనపల్లిలో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా అవినీతి చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. పోలవరం పూర్తి చేయటం తెలియని ఆయన నీటిపారుదల మంత్రి అంటూ పవన్ కళ్యాణ్ సెటైర్ వేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవదన్న పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీకి అమ్ముడుపోయే ఖర్మ నాకు పట్టలేదన్నారు.  

వారాహి బదులు వరాహం అని పెట్టుకో: అంబటి రాంబాబు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకొని రాజకీయాలు చేస్తున్న వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ మండిపడ్డారు. 2 లక్షల లంచం తీసుకున్నాని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. 2019లో జగన్ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్న పవన్ కల్యాణ్... ఆ మాట ఏమైందని ప్రశ్నించారు. జనసేన ప్రచార రథానికి వారాహి బదులు వరాహం అని పెట్టుకో... కొంతైనా మంచి జరుగుతుందని మంత్రి అంబటి రాంబాబు సూచించారు.