ఏపీ జలదోపిడీ  మరింత పీక్స్కు.. జులై 7 నుంచి ఇప్పటివరకు పోతిరెడ్డిపాడు ద్వారా 150 టీఎంసీల మళ్లింపు

ఏపీ  జలదోపిడీ  మరింత పీక్స్కు.. జులై 7 నుంచి ఇప్పటివరకు పోతిరెడ్డిపాడు ద్వారా 150 టీఎంసీల మళ్లింపు
  • ఒక్క ఆగస్టులోనే పోతిరెడ్డిపాడు నుంచి 81 టీఎంసీల తరలింపు
  • శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మొత్తంగా 165 టీఎంసీల దాకా తరలింపు
  • నాగార్జునసాగర్​ నుంచి 102.5 టీఎంసీలు ఇవ్వాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ వినతి
  • డిసెంబర్​ దాకా సాగుకు 88.50 టీఎంసీలు.. తాగునీటికి 14 టీఎంసీలు అవసరమవుతాయని వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: 
ఏపీ జలదోపిడీని పీక్స్​కు చేరుస్తున్నది. ఎలాంటి ఇండెంట్​ పెట్టకుండానే శ్రీశైలం నుంచి విచ్చలవిడిగా నీటిని తరలించుకుపోతున్నది. రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికే నిర్మించుకున్న ఆఫ్​లైన్​ రిజర్వాయర్లను నింపేసుకుంటున్నది. ఇప్పటిదాకా పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా లిఫ్ట్​ స్కీమ్​ల ద్వారా దాదాపు 165 టీఎంసీల వరకు నీటిని మళ్లించుకున్నది. జులై 7న పోతిరెడ్డిపాడు నుంచి 5 వేల క్యూసెక్కులతో నీటి మళ్లింపులను మొదలుపెట్టిన ఏపీ.. ఇప్పుడు దాన్ని మరింత పీక్స్​కు తీసుకెళ్లింది. 

రోజూ 30 వేల క్యూసెక్కులను పోతిరెడ్డిపాడు ద్వారానే తోడేస్తున్నది. ఈ పోతిరెడ్డిపాడు ద్వారానే ఏపీ ఇప్పటిదాకా దాదాపు 150 టీఎంసీలు తరలించినట్టు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఆగస్టులో దోపిడీ మరింత హైట్స్​కు చేరింది. ఆ నెల మొత్తంగా 80.86 టీఎంసీలను ఏపీ తీసుకెళ్లిపోయింది. ఆ నెలలో తొలి 8 రోజులు వరుసగా రోజూ 3.18 టీఎంసీలను మళ్లించింది. ఈ నెల 9న 2.97 టీఎంసీలు, 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 2.9 టీఎంసీలు, 14, 15వ తేదీల్లో 1.82 టీఎంసీలు, 16న 2.30 టీఎంసీలు, 17 నుంచి 27వరకు రోజూ 11 రోజులపాటు 2.72 టీఎంసీలు, ఆ తర్వాత రెండు రోజులు 2.5 టీఎంసీల చొప్పున నీటిని ఏపీ మళ్లించింది. 

ఇక, ఈ నెలలో పది రోజుల్లోనే 28 టీఎంసీలను మళ్లించగా.. గత ఆరు రోజులుగా 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు నుంచి నీటిని డ్రా చేస్తుండడం గమనార్హం. ఈ నీటిని అంతటినీ ఏపీ ఎలాంటి ఇండెంట్​ పెట్టకుండానే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పట్టుకెళ్లిపోతుండడం కలవరపరిచే విషయం. రాబోయే రోజుల్లో ఏపీ జలదోపిడీ మరింత పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. అదే సమయంలో శ్రీశైలం నుంచి మనం తీసుకున్న జలాలు కనీసం 5 టీఎంసీలు కూడా మించలేదు. 

102.5 టీఎంసీలు కావాలి

నాగార్జునసాగర్​ ప్రాజెక్టు కింద సాగు, తాగునీటి అవసరాల లెక్కలను అధికారులు తేల్చారు. డిసెంబర్​ వరకు 102.5 టీఎంసీలు అవసరమవుతాయని స్పష్టం చేశారు. సాగర్​ ఎడమ కాల్వ ద్వారా 70 టీఎంసీలు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్​ నుంచి 32.5 టీఎంసీలను తీసుకోవాల్సి ఉంటుందని లెక్కతీశారు. అందులో సాగుకు 88.50 టీఎంసీలు, తాగునీటికి 14 టీఎంసీలు అవసరమవుతాయని పేర్కొన్నారు. ఆ మేరకు కేటాయింపులను చేయాల్సిందిగా కృష్ణా బోర్డుకు అధికారులు లేఖ రాశారు. 

నెలవారీ అవసరాలతో ఇండెంట్​ పెట్టారు. ఇటు సాగర్​ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ జూన్​ 1 నుంచి ఆగస్టు 31 వరకు 26.715 టీఎంసీల నీటిని వినియోగించుకున్నదని పేర్కొన్నారు. ఎడమ కాల్వ నుంచి 15.517 టీఎంసీలు, ఏఎమ్మార్పీ నుంచి 11.198 టీఎంసీలను తీసుకున్నట్టు తెలిపారు. అదే సమయంలో ఏపీ సాగర్​ కుడి కాల్వ నుంచి 22.73 టీఎంసీలు, ఎడమ కాల్వ నుంచి 5.30 టీఎంసీలు కలిపి మొత్తం 28.03 టీఎంసీలు తీసుకున్నట్టు వెల్లడించారు. 

ప్రస్తుతం ప్రాజెక్టులో డెడ్​స్టోరేజ్​కు పైన 178.59 టీఎంసీల నీళ్లున్నాయని, శ్రీశైలంలో డెడ్​స్టోరేజ్​కు ఎగువన 157.62 టీఎంసీల జలాలు వాడుకోవడానికి అందుబాటులో ఉన్నాయని 
పేర్కొన్నారు. 

నాగార్జునసాగర్​ నుంచి నెలవారీగా నీటి అవసరాలు (టీఎంసీల్లో)

ప్రాజెక్ట్​    సెప్టెంబర్​    అక్టోబర్    నవంబర్    డిసెంబర్    మొత్తం
    సాగు    తాగు    సాగు    తాగు    సాగు    తాగు    సాగు    తాగు    
లెఫ్ట్​ కెనాల్​    18.5    1.5    19.5    1.5    16    1.5    10    1.5    70
ఏఎమ్మార్పీ    6.5    2    6.5    2    6.5    2    5    2    32.5
మొత్తం    25    3.5    26    3.5    22.5    3.5    15    3.5    102.5