కరోనా హాట్ స్పాట్లుగా అపార్టుమెంట్లు,కాలనీలు

కరోనా హాట్ స్పాట్లుగా అపార్టుమెంట్లు,కాలనీలు
  •       సిటీలో వేగంగావిస్తరిస్తున్న వైరస్​
  •      సగానికి పైగా కాలనీల్లోపాజిటివ్​ బాధితులు

అపార్టుమెంట్లు, కాలనీల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ లో  వారం రోజుల నుంచి  హాట్ స్పాట్లుగా మారుతున్నాయి.  మార్కెట్లు, వారాంతపు సంతల నుంచి వ్యాప్తించే కరోనా.. ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వేగంగా స్ర్పెడ్​ అవుతున్నది. దీంతో సిటీలోని వేలాది రెసిడెన్షియల్ కమ్యూని టీలు కరోనా జోన్లుగా ఉన్నాయి. పాజిటివ్ రావడంతో హోం ఐసోలేషన్ లో ఉంటున్నా.. ఆ ఇంట్లోని వారి నుంచి స్థానికులకు వేగంగా సోకు తుంది. దీంతో వైరస్ బాధితులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. 

వచ్చిపోయే విజిటర్లతో..

గ్రేటర్​లో 30లక్షలకు పైగా ఫ్యామిలీలు, 8 వేల  రెసిడెన్షియల్ కాలనీలు, 45 వేలకు పైగా చి న్నా, పెద్ద ఫ్లాట్స్​అసోసియేషన్లు ఉన్నాయి. వీటిల్లో లక్షలాది మంది నివాసం ఉంటున్నారు. ఇప్పుడవన్నీ కరోనాకు హాట్ స్పాట్లుగా మారుతున్నాయి. కామన్ లిప్టుల వాడకం, గేటెడ్ కమ్యూనిటీల్లోని సూపర్, వెజిటేబుల్ మార్కెట్లు, వచ్చిపోయే విజిటర్లతో వైరస్ వ్యాపిస్తున్నది. అన్ లాక్, వ్యాక్సిన్ రాకతో అజాగ్రత్తగా జనాలు ఉండగా, నియంత్రణపై అధికారులు చేతులెత్తేయడంతో కేసులు పెరుగుతున్నాయి. 
 
యూపీహెచ్​సీల్లోనే ఎక్కువగా 

కరోనా టెస్టులు చేస్తున్న ప్రైమరీ హెల్త్ సెంటర్ల కంటే అర్బన్ హెల్త్ సెంటర్లలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. కాలనీలు, అపార్టుమెంట్ల పరిసరాల్లో వైరస్​ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్నది. శుక్రవారం ఓల్డ్ బోయిన్ పల్లిలోని యూపీహెచ్​సీలో 107 మందికి కరోనా టెస్టులు చేయగా  59 మందికి పాజిటివ్ తేలింది. కూకట్ పల్లిలోని కేపీహెచ్​బీ 4వ ఫేజ్ లో 70 మందిలో 20కి పైగా కరోనా బాధితులే.  ఏఎస్ రావు నగర్​లోని అపార్టుమెంట్లు, ఐదారు కాలనీలకు దగ్గరగా ఉన్న ఏరియా హాస్పిటల్ లో 286 మందికి టెస్టులు చేయగా, 111 మందికి కరోనా పాజిటివ్​ వచ్చింది.  స్థానికులు, వలస కూలీలు, ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఎక్కువగా ఉండే జీడిమెట్లలో 52 మందికి టెస్టులు చేయగా, 32 మందికి కరోనా సోకింది.  శేరిలింగంపల్లి పీహెచ్​సీలోనూ 434 మందిలో 107 మందికి, మైలార్ దేవ్ పల్లి యూపీహెచ్​సీలో 174 టెస్టులు చేస్తే 63 మందికి కరోనా సోకినట్లుగా అధికారులు వెల్లడించారు. ప్రతి యూపీహెచ్​సీ పరిధిలో కేసుల్లో 50 శాతం మేర కరోనా పేషెంట్లుగా మారుతుండటం వైరస్ తీవ్రత ఎలా ఉందో తెలుస్తోంది.

టెస్ట్​ చేయించుకుని ఇంటికెళ్లగా..

విద్యానగర్ లోని 12 ఫ్లాట్లు ఉండే అపార్టుమెంట్ లో ఫ్రెండ్​ను కలిసేందుకు వరంగల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వెళ్లాడు. డ్యూటీ కోసమని కొవిడ్ టెస్టు అవసరం కావడంతో సిటీలోనే టెస్టు చేసుకున్నాడు. అయితే ఇంటికెళ్లిన ఒక రోజు తర్వాత రిపోర్టు పాజిటివ్ అని తేలింది. దీంతో అపార్టుమెంట్ లోని రెండు బ్యాచిలర్ ఫ్లాట్లలోని యువకులందరూ టెస్టు చేసుకోగా ముగ్గురికి పాజిటివ్ తేలింది. పక్కపక్కనే ఉండే ఆ ఫ్లాట్ల మధ్య రాకపోకలు జరగాయని తెలిసింది. ప్రస్తుతం ఆ అపార్టుమెంట్ వాసులందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఇలా సిటీలో అపార్టుమెంట్లలోని ఒక ఫ్లాటు నుంచి ఇంకో ఫ్లాట్ల నివాసితులకు కరోనా వ్యాపిస్తున్నది. 

గతేడాది అదే బిల్డింగ్​లో..

కాలనీలు, అపార్టుమెంట్లలోకి వచ్చిపోయే జనాల తో వైరస్ వ్యాప్తి చెందుతున్నది. మదీనగూడలోని మై హోం జువెల్ హైరైజ్ బిల్డింగ్ లో ఉండే 8 వేల మందిలో ప్రస్తుతం 112 మంది కరోనా బారినపడ్డారు. ఇందులో మూ డు, నాలుగు రోజుల వ్యవధిలోనే సోకినవారు ఉన్నారు. గతేడాది ఇదే బిల్డింగ్ నమోదైన కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని స్థానిక వైద్యాధికారులు తెలిపారు. ఈసారి కరోనా బాధితులు ఎక్కువగా  పెరగడానికి వైరస్ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నిత్యవసరాలు, మార్కెట్లు, షాపింగ్ లు, జాబ్​ల రీత్యా వచ్చిపోతున్నా, కరోనా రూల్స్​పాటించట్లేదని వైద్యాధికారులు చెబుతున్నారు. దీంతో ఎవరింట్లో వాళ్లు ఉంటున్నా  ఏదో ఒక రూపంలో వైరస్ సోకుతోంది.

పాజిటివ్ వస్తే పక్కవారికి తెలియకుండా.. 

ఫ్లాట్లలో నివాసం ఉండేవారికి పాజిటివ్ వస్తే, పక్కవారికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రైమరీ కాంటాక్టులకైనా సమాచారం ఇవ్వడం లేదు. దీంతో ప్రైమరీ కాంటాక్టుల నుంచి మరొకరి వేగంగా విస్తరిస్తున్నది. ఏదో రకంగా విషయం బయటపడితే తప్పా  ట్రేసింగ్ జరగట్లేదు. దీంతో కరోనా సోకిందనే విషయాన్ని తెలుసుకునే వీల్లేకుండా పోయిందని రాంనగర్ లోని ఓ అపార్టుమెంట్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి చెప్పారు. గతేడాది అపార్టుమెంట్ లోని వారెవరికైనా కరోనా సోకితే, వెల్ఫేర్ కమిటీకి సమాచారాన్ని స్థానిక సిబ్బంది ఇచ్చి అప్రమత్తం చేశారు. కానీ ఇప్పుడేవీ లేవు. ఎవరి ఇష్టమొచ్చినట్లుగా వస్తున్నరు, కరోనా సోకితే ఇంటికే పరిమితమైతున్నామని చెబుతున్నా,  సరుకుల కోసం రాకపోకలు సాగిస్తున్నారు.