న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ ఘటనకు నిరసనగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను ‘టెర్రరిస్టులు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని కోట్లాది మంది యువతకు మంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలని, తన వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరిని దేశ ద్రోహిగా ముద్ర వేయడమే బీజేపీ రాజకీయమని ఆయన మండిపడ్డారు. ఈమేరకు గురువారం రాహుల్ గాంధీ ‘ఎక్స్’ లో ఒక పోస్ట్ షేర్ చేశారు. ‘‘అధికార అహంకారాన్ని తలకెక్కించుకున్న మోదీ ప్రభుత్వం ఇప్పుడు దేశ యువతను ఉగ్రవాదులనే స్థాయికి చేరింది.
తమ హక్కుల కోసం, పారదర్శకమైన పరీక్షల నిర్వహణ కోసం, భవిష్యత్తు కోసం గళమెత్తుతున్న విద్యార్థులను ఏకంగా కేంద్ర విద్యా మంత్రే టెర్రరిస్టులని అంటున్నారు. ఎవరి వైఫల్యాల వల్ల పేపర్ లీక్‌లు జరిగాయో, ఎవరి నిర్లక్ష్యం వల్ల 20 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారో ఆ వ్యక్తే విద్యార్థులపై ఉగ్రవాదులనే ముద్ర వేస్తున్నారు” అని తెలిపారు.
వసూళ్ల రాకెట్‌గా విద్యా వ్యవస్థ
బీజేపీకి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదని, గతంలో దేశానికి అన్నం పెట్టే రైతులను ఆందోళన్‌జీవి, పరాన్నజీవులు అని పిలిచారని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. ‘‘ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని దేశ ద్రోహులన్నారు. ఇప్పుడు ఏకంగా యువతను ఉగ్రవాదులు అంటున్నారు. ప్రశ్నించే వారిపై ముద్ర వేయడమే వారి రాజకీయం.
ధర్మేంద్ర ప్రధాన్ జీ, దేశ యువతకు వెంటనే క్షమాపణ చెప్పి, పదవి నుంచి తప్పుకోండి’’ అని సూచించారు. ‘‘నాపై ఎంతైనా దాడి చేసుకోండి. ఈ రోజు దేశంలోని విద్యావ్యవస్థ ఒక వసూళ్ల రాకెట్‌గా మారిపోయింది. దీనిని ఇలా కొనసాగనివ్వను. ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందేవరకు నా పోరాటం ఆపను’’ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
