ఇంతటి నిర్లక్ష్యానికి ఓ మహిళగా బాధపడుతున్నా.. కేంద్రమంత్రి కామెంట్స్ కి కవిత కౌంటర్

ఇంతటి నిర్లక్ష్యానికి ఓ మహిళగా బాధపడుతున్నా.. కేంద్రమంత్రి కామెంట్స్ కి కవిత కౌంటర్

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవును కేంద్ర మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ వ్యతిరేకించడం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారం వ్యక్తం చేశారు. స్మృతి ఇరానీ మాటలు నిరుత్సాహానికి గురి చేశాయని, మహిళ అయి ఉండి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అంతకుముందు స్మృతి ఇరానీ మహిళా ఉద్యోగులకు బుుతుక్రమ సమయంలో వేతనంతో కూడిన సెలవు ప్రతిపాదనను వ్యతిరేకించారు. బుుతుస్రావం అనేది వైకల్యం కాదని, అది స్త్రీ జీవిత ప్రయాణంలో ఓ భాగమని.. అందుకు ప్రత్యేకంగా సెలవు ఇవ్వక్కర్లేదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన కల్వకుంట్ల కవిత.. నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలను దృష్టిలో ఉంచుకుని సెలవు మంజూరు చేయాల్సింది పోయి.. ఇలా కొట్టి పారేయడమనేది విచారం కలిగిందన్నారు. మహిళల పట్ల ఇలాంటి నిర్లక్ష్యాన్ని చూడాల్సి వస్తున్నందుకు ఓ మహిళగా బాధపడుతున్నానని చెప్పారు. నెలసరి మనకున్న ఆప్షన్ కాదని, అదొక సహజమాన జీవ ప్రక్రియ అని కవిత తెలిపారు. వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడం అనేది మహిళల బాధను విస్మరించినట్టేనని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక మహిళగా, మహిళలు ఎదుర్కొనే నిజమైన సవాళ్లు, ప్రతిదానికీ మనం ఎదుర్కోవాల్సిన పోరాటం పట్ల సానుభూతి లేకపోవటం విస్తుగొలిపే విషయం అని కవిత ఎక్స్ లో పేర్కొన్నారు.