ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!.. ఇస్ఫహాన్​ సిటీపై డ్రోన్లను కూల్చేసిన ఇరాన్

ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!.. ఇస్ఫహాన్​ సిటీపై డ్రోన్లను కూల్చేసిన ఇరాన్

దుబాయ్: ఇరాన్​లోని కీలకమైన ఇస్ఫహాన్ సిటీపై శుక్రవారం డ్రోన్ దాడి ప్రయత్నం జరిగింది. అయితే, ఇరాన్ ఆర్మీ దీనిని తిప్పికొట్టింది. సిటీపైకి దూసుకొచ్చిన డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో కూల్చేసినట్లు ఆర్మీ తెలిపింది. ఈ దాడి ఇజ్రాయెల్ పనేనని ఇటు ఇరాన్, అటు ఇజ్రాయెల్ ఆర్మీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధికారికంగా మాత్రం ఇరు దేశాలు ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ దాడికి సంబంధించి వివరాలను వెల్లడించేందుకు ఇరాన్ నిరాకరించింది. ఇరాన్ ​ఆర్మీ వర్గాల ప్రకారం.. ఇస్ఫహాన్ సిటీలో మేజర్ ఎయిర్ బేస్ ఉంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా ఇక్కడే ఉంది. ఇజ్రాయెల్​తో ఇటీవలి కాలంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇస్ఫహాన్ సిటీలో సెక్యూరిటీ పటిష్ఠం చేసినట్లు తెలిపింది. 

ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున ఆకాశంలో దూసుకొచ్చిన డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో పేల్చేసినట్లు ఇరాన్ ఆర్మీ కమాండర్ జనరల్ అబ్దుల్ రహీం మౌసావీ ప్రభుత్వ టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ క్రమంలోనే భారీ శబ్దాలు, మంటలు ఎగిసిపడ్డాయని వివరించారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇది ఇజ్రాయెల్​జరిపిన దాడా కాదా అనే విషయంపై ఆర్మీ కమాండర్ స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు, ఇరాన్ ఇటీవల దాదాపు 300 లకు పైగా డ్రోన్లు, క్షిపణులతో చేసిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఈ దాడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈమేరకు ఇజ్రాయెల్ పొలిటీషియన్స్ పలువురు దాడి తమ ఆర్మీ పనేనని పరోక్షంగా చెబుతున్నారు. దీనిపై అమెరికా కూడా అధికారికంగా ప్రకటన చేయలేదు. అమెరికన్ బ్రాడ్ కాస్ట్ నెట్ వర్క్స్ మాత్రం డ్రోన్ దాడి ఇజ్రాయెల్ పనేనని వార్తలు ప్రసారం చేసింది.