
స్నేహ హస్తం ఇస్తూనే కయ్యారికి కాలుదువ్వే నైజం డ్రాగనే దేశం చైనాది. అందుకే ఎంత మంచి మిత్రుడిలా నటించినప్పటికీ చైనా విషయంలో భారత్ జాగ్రత్తగానే ఉంటుంది. చైనాతో ఉన్న బోర్డర్ సమస్యలను టెక్నాలజీతో పరిష్కరించుకునేందుకు ప్రస్తుతం భారత్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం తూర్పు లడఖ్ ప్రాంతంలో భారత బలగాలు సరిహద్దుల వెంబడి పహారా కోసం అత్యాధునిక సర్వేలెన్స్ పరికరాలను ఉపయోగిస్తోంది. దీని ద్వారా చైనా దళాలతో వివాదాలను నివారించాలని ప్రయత్నిస్తోంది. గడచిన 5 ఏళ్లుగా భారత్ దీనికోసం నిరంతరం శ్రమిస్తూ 24 గంటలు ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్, రికాన్నియన్స్ నెట్ వర్క్ స్థాపించింది. దీనిని ఉపయోగించి సైనికులు నడుస్తూ పెట్రోలింగ్ చేసేటప్పుడు సమస్యలను తగ్గించటానికి ప్రయత్నిస్తోంది భారత్. మంచుతో ఉండే శీతాకాలంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవటానికి ఈ సాంకేతికత దోహదపడనుంది.
గత ఏడాది భారత్, చైనాల మధ్య కుదిరిన ఒప్పందంతో గొడవలను నివారించేందుకు ఇరు దేశాల సైనికులు సంయుక్తంగా పెట్రోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. అందుకే నూతన సాంకేతికతను తీసుకురావటం వల్ల సైనికులపై ఒత్తిడి కూడా తగ్గుతుందని, పెట్రోల్ ఆలస్యాలు గొడవలు కూడా తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. 2020 నుంచి అనేక ప్రాంతాల్లో సైనికుల మోహరింపు అవసరం లేదని నిర్ణయించినప్పటికీ.. లైనాఫ్ కంట్రోల్ వద్ద ఇప్పటికీ 60వేల మంది సైనికులు లోతట్టు ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు.
భారత్ లైన్ ఆఫ్ కంట్రోల్ ప్రాంతంలో దాదాపు ఏడాది కిందటి నుంచి పెట్రోలింగ్ పాయింట్లు, ల్యాండ్‌మార్క్‌లు, ముఖ్య అంశాలను జియోట్యాగింగ్ చేస్తోందని వార్తలు వచ్చాయి. ఈ సాంకేతికత వినియోగం ద్వారా అస్పష్టతను తగ్గించడం, భవిష్యత్ చర్చలను సులభతరం చేయడంతో పాటు ప్రమాదవశాత్తు ఘర్షణల అవకాశాలను తగ్గించడం లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతోంది. గత ఏడాది చర్యల తర్వాతి నుంచి ఇండియా చైనా బోర్డర్ ప్రాంతంలో ఎక్కువ శాంతి నెలకొందని రెండు దేశాలు చెబుతున్నాయి. ఇప్పుడు దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.