
హైదరాబాద్: ఫార్ములా-E కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజిలెన్స్ కమిషన్‌కు ఏసీబీ నివేదిక చేరింది. రెండు రోజుల్లో ఫైల్‌పై నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి విజిలెన్స్ కమిషన్ నివేదిక అందించనుంది. ప్రభుత్వం నుంచి తిరిగి ఏసీబీకి నివేదిక చేరుతుంది. కేటీఆర్, ఐఏఎస్ అరవింద్, బీఎల్‌ఎన్ రెడ్డి ప్రాసిక్యూషన్‌పై తుది నివేదిక ఉండనుండటం గమనార్హం. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్‌దగ్గర ఫార్ములా–ఈ కార్ రేస్ నిర్వహించారు.
ఎలక్ట్రిక్ కార్ల రేసింగ్ కోసం బ్రిటన్‌కు చెందిన ఫార్ములా–ఈ ఆపరేషన్స్, హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌కో సిస్టర్ కంపెనీ ఏస్ నెక్ట్స్ జెన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్(ఎంఏయూడీ) మధ్య 2022 అక్టోబర్25న త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. దీని ప్రకారం నాలుగు సీజన్లకు గాను మూడేండ్ల పాటు రూ.600 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో సీజన్ 9,10,11,12 కోసం ట్రాక్ నిర్మాణం సహా ఇతర మౌలిక సదుపాయాలను ఎంఏయూడీ సమకూర్చాల్సి ఉంది.
2023 ఫిబ్రవరి 11న సీజన్ 9 నిర్వహించారు. వివిధ కారణాల వల్ల ఏస్ నెక్ట్స్ జెన్, ఫార్ములా–ఈ ఆపరేషన్స్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌కు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకపోవడంతో ఆ సంస్థ కార్ రేస్ నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందించింది. దీంతో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ఆదేశాలతో ఐఏఎస్అర్వింద్కుమార్.. ఫార్ము లా–ఈ ఆపరేషన్స్, ఎంఏయూడీ మధ్య 2023 అక్టోబర్ 30న కొత్తగా మరో ఒప్పందం చేసుకున్నారు. ఈవెంట్ నిర్వహణ కోసం స్పాన్సర్ ఫీజు, ట్యాక్స్‌లు కలిపి మొత్తం రూ.110 కోట్లు చెల్లించే విధంగా అగ్రిమెంట్‌లో పేర్కొన్నారు. ఈవెంట్ నిర్వహణ కోసం మున్సిపల్ సర్వీసెస్, సివిల్ వర్క్స్ కోసం మరో రూ.50 కోట్లు ఖర్చు చేసే విధంగా అండర్ టేకింగ్ తీసుకున్నారు.
ఏమాత్రం సంబంధం లేని హెచ్‌ఎండీఏ బోర్డు ద్వారా మొత్తం రూ.160 కోట్లు చెల్లించాలని ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే అసెంబ్లీ ఎలక్షన్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నది. వీటికి సంబంధించి ఈసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. కోడ్ అమల్లో ఉన్నప్పటికీ..సీజన్ 10 నిర్వహణకు సంబంధించి 2023 అక్టోబర్3,11వ తేదీల్లో హెచ్‌ఎండీఏ బోర్డు సాధారణ నిధుల నుంచి ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌కు రూ.45 కోట్ల71 లక్షల 60 వేల 625 విదేశీ కరెన్సీలో ట్రాన్స్‌ఫర్ చేశారు.
ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఫారిన్ ట్రాన్సాక్షన్స్ జరగడంతో ఐటీ శాఖ హెచ్‌ఎండీఏకు రూ.8.07 కోట్లు జరిమానా విధించింది. ఈ మొత్తం వ్యవహారంలో హెచ్‌ఎండీఏ బోర్డు ఖజానా నుంచి మొత్తం రూ.54 కోట్ల 88 లక్షల 87 వేల 43 దుర్వినియోగమయ్యాయి. అప్పటికే కాంగ్రెస్ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ వ్యవహారం రూ.54.88 కోట్లకే ఆగిపోయిందని, లేదంటే రూ.600 కోట్ల స్కామ్జరిగి ఉండేదని ఏసీబీ తన నివేదికలో స్పష్టం చేసినట్టు తెలిసింది.