ఇండియా సంచలన నిర్ణయం.. పాలస్తీనా ప్రత్యేక దేశంగా యూఎన్ తీర్మానానికి మద్ధతుగా ఓటు

ఇండియా సంచలన నిర్ణయం..  పాలస్తీనా ప్రత్యేక దేశంగా యూఎన్ తీర్మానానికి మద్ధతుగా ఓటు

ఇజ్రాయెల్-పాలస్తీనా విషయంలో ఇన్నాళ్లు తటస్థంగా ఉన్న ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. పాలస్తీనా ప్రత్యేక దేశంగా ఐక్యరాజ్య సమితి (UN) రిజొల్యుషన్ కు మద్ధతు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా శుక్రవారం (సెప్టెంబర్ 12) UN జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన న్యూయార్క్ డిక్లరేషన్ కు మద్ధతునిస్తూ ఓటు వేసింది. పాలస్తీనా వివాదం ముగిసేందుకు రెండు దేశాల పరిష్కార మార్గానికి మద్ధతు ప్రకటించింది. 

టూ-స్టేట్ సొల్యుషన్ తీర్మానాన్ని ఐక్యారాజ్య సమితి జనరల్ అసెంబ్లీ  (UNGA)లో ఫ్రాన్స్ ప్రవేశపెట్టింది. ఈ తీర్మానికి 142 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. 10 దేశాలు వ్యతిరేకించగా.. 12 దేశాలు దూరంగా ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, అర్జెంటీనా, హంగేరీ తదితర దేశాలు ఈ తార్మానాన్ని వ్యతిరేకించాయి. 

గాజాలో యుద్ధం ముగిసేందుకు.. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం ముగిసేందుకు.. రెండు దేశాల పరిష్కార మార్గానికి అన్ని దేశాలు సంయుక్తంగా మద్ధతు తెలుపుతున్నట్లు ప్రకటించారు వివిధ దేశాల ప్రతినిధులు. పాలస్తీనా, ఇజ్రాయెల్ తో పాటు ఆ ప్రాంతంలోని ప్రజలు ప్రశాంత వాతావరణంలో నివసించేందుకు ముక్తకంఠంతో ఈ తీర్మానానికి మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు. 

ఐక్యరాజ్య సమితి తీర్మానంపై ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. యూఎన్ జనరల్ అసెంబ్లీ వాస్తవాలకు ఎంత దూరంగా ఉందో దీన్ని బట్టి అర్థం అవుతుందని తెలిపింది. టెర్రిరిస్టు గ్రూప్ అయిన హమాస్ గురించి ఒక్క స్టేట్ మెంట్ కూడా లేకపోవడం దారుణం అని వ్యాఖ్యానించింది. 

మరోవైపు న్యూయార్క్ డిక్లరేషన్ ను అమెరికా వ్యతిరేకించింది. జనరల్ అసెంబ్లీ తీర్మానం తప్పుదోవ పట్టించేలా ఉందని.. పబ్లిసిటీ స్టంట్ లో భాగమేనని అమెరికా విమర్శించింది. ఇది హమాస్ ను పెంచి పోషించడమేనని.. వారికి ఒక బహుమతి ఇవ్వడమేనని కామెంట్ చేసింది. 

ఏడు పేజీల డిక్లరేషన్:

గాజాలో యుద్ధం ముగిసేందుకు సంయుక్త చర్యలు తీసుకునేందుకు యూఎన్ దేశాలు ఆమోదించాయి. దీనికి సంబంధించి ఏడు పేజీల డిక్లరేషన్ ను ప్రవేశపెట్టింది జనరల్ అసెంబ్లీ. ఈ డిక్లరేషన్ లో 2024 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడిని ఖండించింది. ఆ దాడిలో 1200 మంది చనిపోగా.. 250 మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ ప్రతిదాడులను ఖండించింది. ఇజ్రాయెల్ దాడులలో ఎంతో మంది నిరాశ్రయులయ్యారని, తీవ్ర విధ్వంసం జరిగిందని పేర్కొంది. రెండు దేశాల తీర్మానానికి ఇజ్రాయెల్ మద్ధతు ఇచ్చి శాంతియుత వాతావరణంలో సమస్య పరిష్కరించుకోవాలని సూచించింది.