బీఆర్ఎస్ ​అసంతృప్తులకు బుజ్జగింపులు

బీఆర్ఎస్ ​అసంతృప్తులకు బుజ్జగింపులు
  • ఎమ్మెల్యేలు సుమన్, దివాకర్​రావు, చిన్నయ్యతోనూ మంత్రి చర్చలు
  • అభ్యర్థుల గెలుపునకు సహకరించాలని ఆదేశం
  • తనకే టికెట్​ ఇవ్వాలన్న అరవింద్​రెడ్డి
  • పిలుపు వచ్చినా వెళ్లని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు

మంచిర్యాల, వెలుగు:  మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో సిట్టింగ్​ఎమ్మెల్యేలకే బీఆర్​ఎస్​ పార్టీ టికెట్లు కేటాయించడంతో ఆశలు పెట్టుకున్న పలువురు లీడర్లు అసమ్మతి రాగం అందుకున్నారు. దీంతో అలర్టైన పార్టీ హైకమాండ్​ నష్టనివారణ చర్యలకు పూనుకుంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్​వర్కింగ్​ ప్రెసిడెంట్, ఐటీ మినిస్టర్ ​కేటీఆర్ అసంతృప్తులకు బుజ్జగింపులు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే పలువురు నేతలతో మంత్రి సమావేశమవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్​రెడ్డి, ఉమ్మడి జిల్లా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్​కుమార్​ శనివారం సెక్రటేరియట్​లో కేటీఆర్​తో భేటీ అయ్యారు.

వారి వెంట ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నడిపెల్లి దివాకర్​రావు, దుర్గం చిన్నయ్య కూడా ఉన్నారు. అరవింద్​రెడ్డి, సతీశ్​కుమార్​తో వేర్వేరుగా భేటీ అయిన కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు సహకరించాలని కోరినట్టు తెలుస్తోంది. సర్వేల ఆధారంగానే సీఎం కేసీఆర్ సిట్టింగ్​ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు చేసినట్లు స్పష్టం చేసిన ఆయన.. పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పకుండా ప్రాధాన్యం ఉంటుందని నచ్చజెప్పినట్టు సమాచారం.

రాజీ కుదిరిందా..?

మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్​రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్​కుమార్​ఈసారి మంచిర్యాల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్​ టికెట్​ఆశించారు. సతీశ్​మూడు నెలల కిందటే కార్యాచరణ మొదలు పెట్టగా, అరవింద్​రెడ్డి టికెట్​తనకే వస్తుందనే ధీమాతో ఎదురుచూశారు. కానీ సిట్టింగ్​ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావుకు టికెట్​ ప్రకటించడంతో కంగుతిన్నారు. దీంతో వీరిద్దరు అసమ్మగతి గళం వినిపించారు. సర్వేల్లో తానే ముందున్నప్పటికీ కేసీఆర్​పట్టించుకోలేదని, దివాకర్​రావును ఓడిస్తానని ఇటీవల జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో అరవింద్​రెడ్డి బహిరంగంగానే అన్నారు.

పురాణం సతీశ్ సొంత నియోజకవర్గం చెన్నూర్​ ఎస్సీ రిజర్వుడ్ కావడంతో ఆయన కూడా మంచిర్యాల నుంచే బరిలో దిగాలని భావించారు. నియోజకవర్గంలోని ఉద్యమకారులు, సింగరేణి కార్మికులు, పార్టీ​లీడర్ల మద్దతు కోరుతూ విస్తృతంగా పర్యటించారు. కానీ ఆయన స్పీడ్​కు సీఎం కేసీఆర్ ఆదిలోనే బ్రేకులు వేయడంతో సైలెంట్​అయ్యారు. తనను రాజకీయంగా అణగదొక్కిన బాల్క సుమన్​ను చెన్నూర్​లో ఓడించడమే లక్ష్యంగా ఆయన ఇటీవల కాంగ్రెస్​ పార్టీతో టచ్​లోకి వెళ్లినట్టు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే వీరంతా మంత్రి కేటీఆర్​ను కలవడం విశేషం. కేటీఆర్​సమక్షంలో ఎమ్మెల్యేలకు, అసంతృప్తి నేతలకు మధ్య రాజీ కుదిరిందేమోనన్న చర్చ మొదలైంది. 

టికెట్​ నాకే ఇయ్యాలని అడిగిన: అరవింద్

ఈ భేటీ విషయంపై అరవింద్​రెడ్డిని ఫోన్​లో సంప్రదించగా.. మంచిర్యాల టికెట్​ తనకే ఇవ్వాలని మంత్రి కేటీఆర్​ను కోరినట్లు తెలిపారు. సిట్టింగ్​ఎమ్మెల్యేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయాన్ని కేటీఆర్​కు వివరించానని చెప్పారు. ఒకవేళ తనకు టికెట్​రాకుంటే బీసీలకు ఇవ్వాలని గట్టిగా డిమాండ్​ చేశానన్నారు. హైకమాండ్​ నుంచి త్వరలోనే సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నానని, లేదంటే తన కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్నారు. 

నల్లాల మదిలో ఏముందో..?

చెన్నూర్​మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు సైతం మంత్రి కేసీఆర్​నుంచి పిలుపు వచ్చినప్పటికీ వెళ్లలేదు. స్థానికంగా మ్యారేజీలకు అటెండ్​కావాల్సి ఉందని, రెండు మూడు రోజుల్లో వచ్చి కలుస్తానని చెప్పినట్టు ఓదెలు  తెలిపారు. గత ఎన్నికల్లో ఓదెలు సిట్టింగ్ సీటును గుంజుకున్న బాల్క సుమన్​మరోసారి చెన్నూర్​టికెట్​దక్కించుకొని ఇక్కడే పాగా వేశారు. దీంతో నల్లాల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆ మధ్య ఆయన కాంగ్రెస్​లోకి వెళ్లారు. అక్కడ ఇముడలేక రెండు నెలలకే సొంత గూటికి తిరిగొచ్చారు. మళ్లీ ఆయన కాంగ్రెస్​, బీజేపీల వైపు చూస్తున్నట్టు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఓసారి కాంగ్రెస్​లోకి వెళ్లిన ఆయన ‘ప్యాకేజీ’ కోసమే తిరిగి బీఆర్ఎస్​లోకి వచ్చారని ఆరోపణలు రావడం వల్ల ఓదెలు విశ్వసనీయత సన్నగిల్లుతోంది.