ఐ ఫోన్లకు సైబర్ ముప్పు! .. పెగాసస్ తరహా కిరాయి

ఐ ఫోన్లకు సైబర్ ముప్పు! ..  పెగాసస్ తరహా కిరాయి

 

  • స్పైవేర్​తో అటాక్.. యూజర్లకు యాపిల్ సంస్థ హెచ్చరిక
  • ఇండియా సహా 91 దేశాలకు వార్నింగ్ మెసేజ్.. కిరాయి 
  • స్పైవేర్ తో దాడికి ప్రయత్నం
  • జర్నలిస్టులు, లీడర్లు, బ్యూరోక్రాట్లే లక్ష్యం.. 60 దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నట్టు వెల్లడి
  • థ్రెట్ నోటిఫికేషన్ల వ్యవస్థను అప్​డేట్​ చేసిన యాపిల్

న్యూఢిల్లీ:  ఇండియాతో పాటు మొత్తం 91 దేశాల్లో ఉన్న ఐ ఫోన్ వినియోగదారులు అలర్ట్​గా ఉండాలని యాపిల్ సంస్థ హెచ్చరించింది. పెగాసస్ మాదిరి కిరాయి స్పైవేర్​తో కొందరు దాడికి ప్రయత్నిస్తున్నారని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం రాత్రి ఐ ఫోన్ యూజర్స్​కు యాపిల్ సంస్థ మెయిల్ చేసింది. అదేవిధంగా ఫోన్లకు నోటిఫికేషన్ పంపింది. జర్నలిస్టులు, పొలిటికల్ లీడర్లు, యాక్టివిస్ట్​లు, డిప్లొమాట్స్, సినీ నటులు, బ్యూరోక్రాట్ల, వ్యాపారుల ఫోన్లే లక్ష్యంగా కిరాయి స్పైవేర్​తో దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పింది. ఇప్పటికే కొందరి ఫోన్లలో కిరాయి స్పైవేర్ దూరి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు యాపిల్ సంస్థ.. థ్రెట్ నోటిఫికేషన్ల వ్యవస్థను అప్టేడ్ చేసింది. ఐ ఫోన్లను హ్యాక్ చేసేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తుంటారని, జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి లింక్​లను క్లిక్ చేయొద్దని సూచించింది. పెగాసస్ లాంటి స్పైవేర్​లు డెవలప్ చేస్తున్న సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయని తెలిపింది. కాగా, ఐఫోన్ యూజర్లను అప్రమత్తం చేసిన దేశాల జాబితాను మాత్రం యాపిల్ సంస్థ వెల్లడించలేదు. ఇండియాలో లోక్​సభ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో.. యాపిల్ సంస్థ పంపిన అలర్ట్ నోటిఫికేషన్ హాట్ టాపిక్​గా మారింది. యాపిల్ కంపెనీ ఇలా హెచ్చరికలు చేయడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి. గతేడాది అక్టోబర్ లో ఇండియాలోని పలువురు సెలబ్రిటీలు, ప్రతిపక్ష నేతలను అప్రమత్తం చేసింది.

డీ యాక్టివేట్ చేయడం కష్టం

ఎన్ఎస్​వో గ్రూప్ తయారు చేసిన పెగాసస్ వంటి వాటిని కిరాయి స్పైవేర్ (మెర్సినరీ స్పైవేర్) అంటారు. వార్నింగ్ నోటిఫికేషన్‌‌లు ఎలా పనిచేస్తాయనే వివరాలతో పాటు కిరాయి స్పైవేర్ దాడుల ద్వారా లక్ష్యంగా చేసుకున్న యూజర్స్ సమాచారంతో పాటు సపోర్టు డాక్యుమెంట్ కూడా యాపిల్ కంపెనీ అప్డేట్ చేసింది. ఇండియాతో పాటు దాదాపు 60 దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్నాయి. కిరాయి స్పైవేర్ అటాక్ కాస్ట్.. కొన్ని మిలియన్ డాలర్లు ఉంటుంది. స్పైవేర్​ను గుర్తించడం.. డీ యాక్టివేట్ చేయడం చాలా కష్టమని కూపర్టినో బేస్డ్ యాపిల్ సంస్థ తెలిపింది. అయితే, చాలా తక్కువ మంది కిరాయి స్పైవేర్ దాడి బారినపడ్తారని చెప్పింది. సమాజంలో హోదా, సదరు వ్యక్తుల పాత్ర, స్థాయి ఆధారంగానే సైబర్ నేరగాళ్లు వారి ఐఫోన్​లను టార్గెట్ చేస్తుంటారని తెలిపింది. కాగా, ఇప్పటి దాకా గవర్నమెంట్ సపోర్టెడ్ సైబర్ అటాక్స్​గా వివరించిన యాపిల్ సంస్థ.. ఇప్పుడు.. కిరాయి స్పైవేర్ (మెర్సినరీ స్పైవేర్) ముప్పుగా చెప్తుండటం గమనార్హం. 

యాపిల్ పంపిన నోటిఫికేషన్ ఏంటంటే.. 

‘‘మీ ఫోన్ మెర్సినరీ స్పైవేర్ అటాక్ కు గురైనట్లు గుర్తించాం. మీ ఐడీ సహా మా దగ్గర ఉన్న మీ వివరాల ఆధారంగా ఈ విషయం తెలిసింది. మీ వృత్తి కారణంగానే మిమ్మల్ని టార్గెట్ చేసుకుని ఈ స్పైవేర్ అటాక్ జరిగింది. సాధారణంగా ఇలాంటి స్పైవేర్ అటాక్ ల గుర్తింపు, నిర్ధారణపై వందకు వంద శాతం గ్యారంటీ ఉండదు. అయితే, మీ ఫోన్ అటాక్ కు గురైందనే విషయంలో పూర్తి క్లారిటీతోనే మేము ఈ నోటీసులు పంపుతున్నాం. అందువల్ల ఈ నోటీసులను సీరియస్ గా తీసుకోండి’’ అంటూ యాపిల్ తన నోటీసులలో పేర్కొంది.

సైబర్ అటాక్​ను ముందే గుర్తించలేం

పెగాసెస్ స్పైవేర్ అనేది.. వాట్సాప్​లో మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా ఫోన్​లో దూరుతుందని యాపిల్ సంస్థ తెలిపింది. కిరాయి స్పైవేర్.. ఎలా.. ఎవరిపై స్పైవేర్ దాడి జరుగుతుందో ముందే గుర్తించడం చాలా కష్టం. అయితే, సైబర్ దాడి జరుగుతుందని మాత్రం ముందు హెచ్చరించగలమని యాపిల్ సంస్థ నోటిఫికేషన్​లో తెలిపింది. అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీ ద్వారా కిరాయి స్పైవేర్ తయారు చేస్తుంటారు. లాక్​డౌన్ మోడ్ ఎనేబుల్ చేయడంతో తమ డివైజ్​ను ఇలాంటి స్పైవేర్ దాడుల నుంచి రక్షించుకోవచ్చని చెప్పింది. కిరాయి స్పైవేర్ తయారు చేయాలంటే కొన్ని మిలియన్ డాలర్లు అవసరం అవుతాయి. అయితే, దీని కోసం ముందుగా భారీ ఎత్తున నిధులు సమకూర్చుకుంటారు. రోజురోజుకూ మారుతున్న టెక్నాలజీ ఆధారంగా స్పైవేర్​లోనూ మార్పులు చేస్తూ ఉంటారు. ఇలాంటి కిరాయి స్పైవేర్ అటాక్స్ నుంచి ముందే గుర్తించేందుకు తమ సంస్థ పటిష్టమై టెక్నాలజీని కలిగి ఉందని యాపిల్ వివరించింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పరిశోధనలు కూడా చేస్తూ ఉంటుందని తెలిపింది. కిరాయి స్పైవేర్​లు టార్గెట్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని నోటిఫికేషన్​లో పేర్కొంది.