అప్లికేషన్లు 10 వేలు.. బకాయిలు రూ.1,127 కోట్లు

అప్లికేషన్లు 10 వేలు.. బకాయిలు రూ.1,127 కోట్లు
  •      అమౌంట్‌ చెల్లించాలని కోరుతున్నా స్పందించని ఆర్టీసీ 
  •     సంస్థ తీరుతో తగ్గుతున్న సీసీఎస్ మెంబర్లు

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే సీసీఎస్ (క్రెడిట్ కో ఆపరేటివ్ సోసైటీ)లో లోన్ల అప్లికేషన్ల సంఖ్య భారీగా పెరిగింది. 2021 నుంచి కార్మికులు, ఉద్యోగుల జీతాల నుంచి ఆర్టీసీ యాజమాన్యం డబ్బులు కట్ చేసుకుంటున్నా.. సీసీఎస్‌కు చెల్లించడం లేదు. దీంతో ఇప్పటివరకు 10 వేల లోన్ల అప్లికేషన్లు పెండింగ్‌లో పడిపోయాయి. అలాగే, జీతాల నుంచి కట్‌ చేస్తున్న అసలు రూ.677 కోట్లు కాగా, వడ్డీ రూ.450 కోట్లుగా ఉంది. మొత్తం రూ.1,127 కోట్లను ఆర్టీసీ సంస్థ సీసీఎస్‌కు చెల్లించాల్సి ఉంది. 

కార్మికుల నుంచి కట్ చేసిన నిధులను ప్రతి నెల సీసీఎస్‌కు విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించినా.. సంస్థకు నష్టాలు వస్తున్నాయని, అప్పులు ఉన్నాయంటూ విడుదల చేయడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇంటి నిర్మాణం తదితర అవసరాలకు లోన్లు ఇవ్వాలని సీసీఎస్‌కు ఆర్టీసీ కార్మికులు పెట్టుకుంటున్న అప్లికేషన్లు భారీగా పెరిగిపోతున్నాయి. 

సభ్యత్వం క్యాన్సిల్ చేసుకుంటున్నరు..

సీసీఎస్ ఆర్థిక పరిస్థితి చూసి ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు తమ సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటున్నారు. గతంలో 42 వేల మంది కార్మికులు, ఉద్యోగులు, అధికారులు సీసీఎస్ మెంబర్స్‌గా ఉండగా, ప్రస్తుతం 32 వేలకు తగ్గింది. ప్రతి నెల సుమారు 400 మంది సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఎండీ తర్వాత ఉన్నత స్థానాల్లో ఉన్న ఈడీలు, ఆర్‌‌ఎంలు, డీవీఎంలు, డీఎంలు కూడా ఉండటం గమనార్హం. గతంలో ప్రతి నెల రూ.18 కోట్లు సీసీఎస్‌కు ఆర్టీసీ చెల్లించాల్సి ఉండగా మెంబర్ షిప్ రద్దు చేసుకుంటుండడంతో ఆ అమౌంట్ రూ.15 కోట్లకు తగ్గింది. 

ఇందులో రూ.10 కోట్లు మాత్రమే నెలలో విడతల వారీగా సీసీఎస్‌కు ఆర్టీసీ విడుదల చేస్తోంది. లోన్ అప్లికేషన్లు, సభ్యత్వం రద్దు చేసుకున్న కార్మికులకు అమౌంట్ సెటిల్ చేసేందుకు రూ.550 కోట్లు అవసరమని సీసీఎస్ అధికారులు కోరుతున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ను ఇటీవల ఆర్టీసీ యూనియన్లు కలిసి, సీసీఎస్ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తమ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరారు. 

ప్రభుత్వం వడ్డీ లెక్కలు చూపించలె..

సీసీఎస్‌కు ఆర్టీసీ యాజమాన్యం మొత్తం రూ.1,127 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇందులో వడ్డీ రూ.450 కోట్లు ఉంది. గతేడాది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే టైమ్‌లో సంస్థపై సమగ్ర నివేదికను అందజేయాలని గత బీఆర్‌‌ఎస్‌ ప్రభుత్వం కోరింది. దీంతో ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన లెక్కల్లో ఈ వడ్డీ చూపించకపోవడం గమనార్హం. దీనిపై సీసీఎస్ ఇన్‌చార్జి కమిటీ మెంబర్లు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. వేల మంది కార్మికుల జీతాల నుంచి డబ్బులు కట్ చేసి, ఆ బకాయిలు చెల్లించకుండా, సంస్థ తమ అవసరాలకు ఉపయోగించుకొని వడ్డీని ఎగ్గొట్టాలని చూసిందని మండిపడ్డారు. 

బ్యాంక్‌ల నుంచి లోన్లు తీసుకొని వాటికి వడ్డీ కడుతున్న ఆర్టీసీ.. సీసీఎస్‌కు కట్టాల్సిన వడ్డీ ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించింది. ఈ క్రమంలో కార్మికుల నుంచి వ్యతిరేకత, విమర్శలు రావడంతో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మరో నివేదికలో వడ్డీని కూడా చూపించినట్లు బస్ భవన్ అధికారులు 
చెబుతున్నారు.