త్వరలోనే అసెంబ్లీ ముందుకు గిగ్ వర్కర్ల బిల్లు.. కనీస వేతన చట్టం అమలయ్యేలా చర్యలు: మంత్రి వివేక్

త్వరలోనే అసెంబ్లీ ముందుకు గిగ్ వర్కర్ల బిల్లు.. కనీస వేతన చట్టం అమలయ్యేలా చర్యలు: మంత్రి వివేక్

వివిధ రంగాలలో పనిచేస్తున్న గిగ్ వర్కర్లకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. త్వరలోనే గిగ్ వర్కర్ల బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. గురువారం (నవంబర్ 06) వివిధ యూనియన్లతో చర్చించిన మంత్రి.. గిగ్ వర్కర్లకు న్యాయం చేయనున్నట్లు హామీ ఇచ్చారు. 

ఎంతో మంది గిగ్ వర్కర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని.. అన్ని రంగాల్లో గిగ్ వర్కర్లకు అండగా ఉంటామని ఈ సందర్భంగా మంత్రి వివేక్ అన్నారు. ఎన్నికల ముందు గిగ్ వర్కర్లకు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని.. ఆ మేరకు వారికి మేలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని చెప్పారు. గిగ్ వర్కర్లకు కనీస వేతనాలు వచ్చేలా అగ్రిగేటర్స్ తో మాట్లాడి నిర్ణయానికి రావాలని రాహుల్ గాంధీ చెప్పినట్లు గుర్తు చేశారు. రాహుల్ సూచనల మేరకు వర్కర్లకు న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. 

గిగ్ వర్కర్లు ఒక్కొక్కరు గంట జొమాటోకు పనిచేస్తే , మరో గంట స్విగ్గీకి చేస్తారని.. వారికి కనీస వేతన చట్టం ఎలా అమలు చేయాలనే దానిపై చర్చిస్తున్నట్లు చెప్పారు. 1962 లో తీసుకొచ్చిన మినిమమ్ వేజెస్ చట్టంలో ఎన్నో మార్పులు వచ్చాయని.. ప్రస్తుతం వర్కర్లకు న్యాయం చేసేందుకు కావాల్సిన మార్పుల గురించి ఆలోచిస్తున్నట్లు తెలిపారు. 

గిగ్ వర్కర్లకు సంబంధించిన డ్రాఫ్టింగ్ పూర్తవుతోందని.. త్వరలోనే అసెంబ్లీకి వెళ్తుందని చెప్పారు. ఇప్పటి వరకు వారికి భద్రత లేదని.. వారికి భద్రత ఎలా కల్పించాలనే కోణంలో ఆలోచిస్తున్నామని చెప్పారు. ఈ అంశాలన్నీ డ్రాఫ్ట్ లో పొందుపరుస్తున్నామని తెలిపారు. త్వరలోనే పరిష్కారం వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వర్కర్లకు హామీ ఇచ్చారు.