
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో 293 వైన్ షాపులు
- 2023_25లో ఉమ్మడి వరంగల్లో 16,037 అప్లికేషన్లు
- ఈసారి శుక్రవారం నాటికి 4544 దాటని దరఖాస్తులు
- రూ.3 లక్షల ధరతో వ్యాపారుల ఆచీతూచి అడుగులు
వరంగల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం 2025_27 కొత్త ఎక్సైజ్‍పాలసీ అమలు చేస్తున్న క్రమంలో ఓరుగల్లులో కొత్తగా వైన్ షాపులు దక్కించుకోనున్నారు. ఆబ్కారీ శాఖ రూ.3 లక్షల ఫీజుతో దరఖాస్తు చేసుకోడానికి నోటిఫికేషన్ జారీ చేయగా, దరఖాస్తుల గడువు నేడు ముగియనుంది. చివరి రెండు రోజులు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. 23న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 293 షాపులను సంబంధించిన కలెక్టర్లు లక్కీ డ్రా పద్ధతిలో కేటాయించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
2023 పాలసీలో 16,037 అప్లికేషన్లు
రాష్ట్రంలో రెండేండ్లకోసారి అమలు చేసే లిక్కర్‍పాలసీలో ఓరుగల్లు వ్యాపారుల భాగస్వామ్యం పెరుగుతూ వస్తోంది. 2017_19లో వైన్‍షాపుల కోసం దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 7,527 ఉండగా, 2019_21 నాటికి 8,100 చేరింది. 2021_23 పాలసీలో 9,950 అప్లికేషన్లు రాగా, 2023_25 నాటికి రికార్డు స్థాయిలో 16,037 దరఖాస్తులు వచ్చాయి. మొదట్లో ఒక్కో పాలసీ మధ్య ఎక్కువలో ఎక్కువ 1500 అప్లికేషన్లు పెరగగా, 2023_25లో అత్యధికంగా 6,087 దరఖాస్తులు పెరిగాయి.
చివరిరోజు దరఖాస్తులపైనే ఆశ..
ఆబ్కారీ శాఖ ఓరుగల్లులో 5 జిల్లాల పరిధిలో డివిజన్లవారీగా విధులు నిర్వహిస్తోంది. గత పాలసీలలో వ్యాపారుల నుంచి వచ్చిన పోటీతో పోలిస్తే ఈసారి గడువు చివరికి వచ్చేసరికి కూడా ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. అప్లికేషన్ ధర రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెరగడం, నేడోరేపో లోకల్ బాడీ ఎలక్షన్లు రావడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంత తగ్గుముఖం పట్టడం ఈసారి లిక్కర్ వ్యాపారులపై ఎఫెక్ట్ చూపుతోంది.
2023_25 పాలసీలో ఓరుగల్లు నుంచి 16,037 అప్లికేషన్లు రాగా, శుక్రవారం రాత్రి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 4544 మాత్రమే వచ్చాయి. దీంతో ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్లు చివరిరోజైన శనివారం వచ్చే అప్లికేషన్ల మీదే ఆశలు పెట్టుకున్నారు.