
- కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అదే స్థాయిలో
- డీసీసీకి 32 మంది, సిటీ కాంగ్రెస్‌కు 22 మంది దరఖాస్తు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవులకు ఆశావహుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో సోమవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయ కార్యదర్శులు నాత శ్రీనివాస్, దొంతి గోపికి ఆశావహులు, వారి తరఫున అనుచరులు దరఖాస్తులను నేరుగా అందజేశారు. డీసీసీ అధ్యక్ష పదవికి 32 మంది దరఖాస్తు చేసుకోగా, సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోరుతూ 22 మంది అప్లై చేసుకున్నారు.
డీసీసీ పదవి కోసం..
డీసీసీ అధ్యక్ష పదవి కోసం కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు తరఫున మాజీ కార్పొరేటర్లు ఆకుల ప్రకాశ్, ఆకుల నరసన్న, డీసీసీ ప్రధాన కార్యదర్శి మూల వెంకటరవీందర్ రెడ్డి దరఖాస్తు సమర్పించారు. సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, లీడర్లు పత్తి కృష్ణారెడ్డి, కర్ర సత్యప్రసన్నరెడ్డి, బొమ్మ శ్రీరామ్‌చక్రవర్తి, ఆకారపు భాస్కర్‌రెడ్డి, పులి ఆంజనేయులు గౌడ్, పడాల రాహుల్, రుద్ర సంతోష్, తదితరులు అప్లికేషన్లు ఇచ్చారు.
సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోరుతూ దరఖాస్తు చేసిన వారిలో బానోతు శ్రావణ్ నాయక్, ముల్కల ప్రవీణ్, షబానా మహమ్మద్, కొరివి అరుణ్ కుమార్, మహమ్మద్ తాజుద్దీన్, మాచర్ల ప్రసాద్, సయ్యద్ ముజీబ్ హుస్సేన్, కంకణాల అనిల్‌కుమార్, సర్దార్ ధన్‌సింగ్, మహమ్మద్ అబ్దుల్‌సలాం, అస్తపురం రమేశ్‌తోపాటు మరికొందరు ఉన్నారు. ఈ దరఖాస్తులను ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులకు అందజేయనున్నట్లు జిల్లా కాంగ్రెస్ కార్యాలయ కార్యదర్శులు తెలిపారు.
నేడు నియోజకవర్గ కేంద్రాల్లో అబ్జర్వర్ల మీటింగ్
డీసీసీ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఏఐసీసీ ప్రతినిధిగా శ్రీనివాస్ మనె(హంగల్ ఎమ్మెల్యే, కర్ణాటక), పీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ సోమవారం కరీంనగర్ వచ్చారు. వారికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ నరేందర్‌రెడ్డి స్వాగతం పలికారు. నియోజకవర్గాల వారీగా పర్యటిస్తూ బ్లాక్, మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంతోపాటు అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు.
మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 1.30 వరకు చొప్పదండి నియోజకవర్గంలో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మానకొండూర్‌లో, గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు హుజూరాబాద్‌లో, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కరీంనగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఆశావాహులతో విడివిడిగా సమావేశమవుతారు.