
- రాష్ట్రవ్యాప్తంగా 43 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి
- బ్రిడ్జిలు ప్రారంభంకాక పబ్లిక్కు తిప్పలు
- ఇటీవల ఆర్ అండ్ బీ రివ్యూలో ఆఫీసర్లపై మంత్రి వెంకటరెడ్డి ఫైర్
- వెంటనే టెండర్లు పిలవాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి బ్రిడ్జిలు కట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటికి అప్రోచ్ రోడ్లు వేయకపోవడంతో నిరుపయోగంగా మారాయి. ఏండ్ల తరబడి వినతిపత్రాలు ఇచ్చి వంతెనలు సాధించుకున్న జనం.. తీరా అవి వినియోగంలోకి రాకపోవడంతో ఇబ్బందులు పడ్తున్నారు. రాష్ర్టవ్యాప్తంగా ఆర్ అండ్ బీ పరిధిలో నిర్మాణం పూర్తయి, ప్రారంభానికి నోచుకోని హైలెవెల్ బ్రిడ్జిలు 43 దాకా ఉన్నాయి. మొత్తం 25 జిల్లాల్లోని ఈ వంతెనలను రూ.250 కోట్లతో నిర్మించారు. వాటికి కనెక్టివిటీగా అప్రొచ్ రోడ్లు నిర్మించకపోవడంతో ఆయా చోట్ల వెహికల్స్ వెళ్లకుండా బారికేడ్లు పెట్టారు. ఈ బ్రిడ్జిలు అందుబాటులోకి వస్తే ఒక్కో చోట కనీసం పది నుంచి 50 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని భావిస్తున్నారు. కాగా.. ఇటీవల ఆర్ అండ్ బీ ఆఫీసర్లతో ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రివ్యూ చేపట్టారు. బ్రిడ్జిల అంశం ఆయన దృష్టికి రావడంతో అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు.
ఆ 43 ప్రాంతాల్లో అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో అధికారులు రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రెడీ చేసి ఉన్నతాధికారుల ఆమోదానికి పంపారు. 46 చోట్ల అప్రొచ్ రోడ్ల నిర్మాణం, రెయిలింగ్ వాల్స్ నిర్మాణానికి రూ.120 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. వచ్చే నెలలో టెండర్లు పిలిచి వర్షాకాలం ప్రారంభమయ్యే లోపు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. కొన్ని జిల్లాల్లో అప్రోచ్ రోడ్లు నిర్మించేందుకు రెండు వైపులా భూమి కోసం ప్రయత్నాలు చేయగా, కొన్ని చోట్ల భూములు ఇవ్వడానికి నిరాకరించి భూ యజమానులు కోర్టులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ వివాదాలు ఉంటే వారితో అధికారులు చర్చించి పరిహారం ఇచ్చి వివాదాలు సెటిల్ చేయాలని మంత్రి ఆదేశించారు.
ఈ నియోజకవర్గాల్లో అప్రోచ్ రోడ్లు
- మెదక్, దేవరకద్ర, నిర్మల్, చేవెళ్ల, అచ్చంపేట, కోదాడ, దేవరకొండ, ఎల్లారెడ్డి, మంథని, మహబూబాబాద్, ఇల్లందు, జనగామ జిల్లాలోని చేర్యాల, బాన్సువాడ నియోజకవర్గాల్లో నిర్మించిన బ్రిడ్జిలకు అప్రోచ్ రోడ్లు వేయాల్సి ఉంది.
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నీరుకుల్ల సుల్తానాబాద్ మధ్య మానేరుపై రూ. 40 కోట్లతో నిర్మించిన బ్రిడ్జ్ ఇది. అప్రోచ్ రోడ్డు వేయకపోవడంతో పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- నిజామాబాద్ జిల్లాలోని ధర్మారెడ్డి- -ముద్దపూర్ వయా వెంకంపల్లి రోడ్డు మధ్యలో మంజీరా నదిపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మించి అప్రోచ్రోడ్ వేయలేదు. ఈ బ్రిడ్జిపైనా రాకపోకలు లేకుండా నిరుపయోగంగా ఉంది.