రూ.20.90 కోట్లతో బెల్లంపల్లి..మున్సిపల్ బడ్జెట్​కు ఆమోదం

రూ.20.90 కోట్లతో బెల్లంపల్లి..మున్సిపల్ బడ్జెట్​కు ఆమోదం

బెల్లంపల్లి, వెలుగు : బెల్లంపల్లి మున్సిపల్​ బడ్జెట్​ను శుక్రవారం కౌన్సిల్ ఆమోదించింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో చైర్ పర్సన్ జక్కుల శ్వేత అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎమ్మెల్యే గడ్డం వినోద్, కమిషనర్ మల్లారెడ్డి, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. 2024-–25 ఆర్థిక సంవత్సరానికి  గానూ రూ.20.90 కోట్ల అంచనాలతో రూపొందించిన  బడ్జెట్ ను చైర్ పర్సన్ సభలో ప్రవేశపెట్టగా కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. 

బెల్లంపల్లిలో ఆక్రమణలపై కఠిన చర్యలు : కలెక్టర్

మున్సిపల్ కౌన్సిలర్లు దామెర శ్రీనివాస్ , బండి ప్రభాకర్ యాదవ్ యాదవ్, సూరం సంగీత మాట్లాడుతూ.. మున్సిపాలిటీ లోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేయగా కలెక్టర్ సంతోష్​స్పందించారు. పట్టణంలో జరుగుతున్న ప్రభుత్వ భూముల కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కింద పనిలోకి తీసుకున్న 20 మంది కార్మికులను అవసరాన్ని బట్టి వినియోగించుకుంటామని, వారిని పూర్తిస్థాయిలో పనిలోకి తీసుకోవాలని ఎలాంటి నిబంధనలు లేవని అన్నారు. 

మున్సిపల్ అభివృద్ధిపై రాజీ పడేది లేదు : ఎమ్మెల్యే 

బెల్లంపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి చేసేందుకు మున్సిపల్ కౌన్సిలర్లు తనకు సహకరించాలని, అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి మూడు నెలలకోసారి మున్సిపల్ ప్రత్యేక సమావేశం నిర్వహించి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం మెరుగుపడే విధంగా పనులు చేయించాలని కౌన్సిలర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ డీఈ మక్సూద్ అలీ, ఏఈ సందీప్, మున్సిపల్ కౌన్సిలర్లు షేక్ అప్సర్, భూక్య రాములు నాయక్, సురేశ్, మధు, సముద్రాల లావణ్య, లీల, గోసిక రమేశ్ తదితరులు పాల్గొన్నారు.