
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (APSSFC) ప్రమాదం అంచుల్లో నిలబడిందని ఎనలిస్టులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఎసెట్స్‌ను ఇంకా విడదీయకపోవడంతో ఈ ప్రమాదం ఎదురు కానుందని అంటున్నారు. ఏపీఎస్‌ఎఫ్‌సీ విభజన పూర్తి కాకపోవడంతో త్వరలో తిరిగి చెల్లించాల్సిన రూ. 641 కోట్ల బాండ్స్‌ను చెల్లించలేకపోవచ్చని ఇండియా రేటింగ్స్ సీనియర్ ఎనలిస్టు చెప్పారు. ఇప్పటికే ఏపీఎస్‌ఎఫ్‌సీ బాండ్స్ రేటింగ్‌ను తగ్గించేశారు. అంతకు ముందున్న రేటింగ్ నుంచి ఇటీవలే రేటింగ్‌ను బీ కేటగిరీకి మార్చారు. బీబీబీ రేటింగ్‌కు దిగువ రేటింగ్ అంటే స్పెక్యులేటివ్ గ్రేడ్‌గా పరిగణిస్తారు. ఏపీఎస్‌ఎఫ్‌సీ తీవ్రమైన లిక్విడిటీ కొరత ఎదుర్కొంటోందని, రాష్ట్ర విభజనే దీనికి ప్రధాన కారణమని ఇండియా రేటింగ్ సీనియర్ ఎనలిస్ట్ దివ్య శ్రీవాస్తవ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కార్పొరేషన్‌ను ఇంకా రెండుగా విభజించలేదు. ఆస్తుల పంపకంలో ఏపీఎస్‌ఎఫ్‌సీ తెలంగాణ డివిజన్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దాంతో 2017 నుంచి లిక్విడిటీ సమస్య తలెత్తిందని అధికారులు చెబుతున్నారన్నారు. విభజనకు బోర్డు స్థాయిలో అనుమతి ఉందని, కానీ ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందని శ్రీవాస్తవ చెప్పారు. ఫలితంగా బాండ్స్‌కు ఎప్పటిలా రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ ఉండదని పేర్కొన్నారు. బాండ్స్ జారీ ద్వారా మొత్తం రూ. 641 కోట్లు సేకరించగా, అందులో రూ. 121 కోట్ల బాండ్స్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి మెచ్యూర్ కానున్నాయి. అంటే, ఈ రూ. 121 కోట్లను డిసెంబర్, 2019 నాటికి ఏపీఎస్‌ఎఫ్‌సీ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తానికి జారీ చేసిన బాండ్స్ కొన్ని 2022, 2023 లలో మెచ్యూర్ కానున్నాయి. ఐతే, విభజన అనేది ప్రొసీజర్‌కి సంబంధించిన అంశమేనని, కాబట్టి, బాండ్స్ తిరిగి చెల్లించడంలో ఏపీఎస్‌ఎఫ్‌సీ విఫలం కాదని మరి కొంత మంది ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.