షాంఘై: ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–2లో స్టార్ ఆర్చర్లు నిరాశపర్చినా.. సిమ్రన్‌జిత్ కౌర్, సాహిల్ జాదవ్ పతకం ఆశలను సజీవంగా నిలిపారు. శుక్రవారం జరిగిన విమెన్స్ రికర్వ్ క్వార్టర్ ఫైనల్లో సిమ్రన్‌జిత్ 6–0తో ఫాంగ్ యు జు (తైవాన్)పై గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. 9 బాణాల్లో ఆరు పాయింట్లు మాత్రమే చేజార్చుకున్న సిమ్రన్.. యు జుకు ఏమాత్రం చాన్స్ ఇవ్వకుండా వరుస సెట్లలో ఆధిపత్యం చూపెట్టింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన దీపికా కుమారి, కుంకుమ్ మొహోద్ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు.
దీపిక.. చెయోంగ్ (సౌత్ కొరియా) చేతిలో, కుంకుమ్.. అలెగ్జాండ్రా వాలెన్సియా (మెక్సికో) చేతిలో ఓడారు. మెన్స్ రికర్వ్‌లో ధీరజ్ బొమ్మదేవర 0–6తో వాలడోంట్ (ఫ్రాన్స్) చేతిలో ఓడగా, తరుణ్‌దీప్ రాయ్, అటాన్ దాసు స్టార్టింగ్‌లోనే వెనక్కి వచ్చేశారు. మెన్స్ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో సాహిల్ జాదవ్ సెమీస్‌లో అడుగుపెట్టాడు. క్వార్టర్‌ఫైనల్లో సాహిల్, నికో వీనర్ చెరో 147 పాయింట్లతో సమంగా నిలిచారు. దాంతో ఇద్దరి మధ్య నిర్వహించిన షూటాఫ్‌లో సాహిల్ 10 పాయింట్లు నెగ్గగా, వీనర్ 9 పాయింట్లకే పరిమితమయ్యాడు.
