టీఎస్‌‌‌‌పీఎస్సీ మెంబర్స్‌‌‌‌ భర్తీకి అప్లికేషన్లు ఆహ్వానించారా? లేదా? : హైకోర్టు

టీఎస్‌‌‌‌పీఎస్సీ మెంబర్స్‌‌‌‌ భర్తీకి అప్లికేషన్లు ఆహ్వానించారా? లేదా? :  హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్‌‌‌‌ పబ్లిక్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ కమిషన్‌‌‌‌(టీఎస్‌‌‌‌పీఎస్సీ) మెంబర్స్‌‌‌‌ నియామకం చేసే ముందు దరఖాస్తులను ఆహ్వానించారా..? లేదా...? చెప్పాలని రాష్ట్ర సర్కార్‌‌‌‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సభ్యులను ఏ ప్రాతిపదికపై నియమించారో చెప్పాలని ఆదేశించింది. మెంబర్స్‌‌‌‌ నియామకానికి చెందిన పూర్తి వివరాలు సమర్పించాలని చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌ భూయాన్, జస్టిస్‌‌‌‌ సీవీ భాస్కర్‌‌‌‌రెడ్డిల డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ ఆదేశాలిచ్చింది. టీఎస్‌‌‌‌పీఎస్సీ మెంబర్స్‌‌‌‌ నియామకం చట్ట నిబంధనలకు అనుగుణంగా జరగలేదని హైదరాబాద్‌‌‌‌కు చెందిన ప్రొఫెసర్‌‌‌‌ వినాయక్‌‌‌‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌‌‌‌ను సోమవారం హైకోర్టు విచారించింది. 

రామావత్‌‌‌‌ ధన్‌‌‌‌సింగ్, సుమిత్ర ఆనంద్, చంద్రశేఖర్‌‌‌‌రావు, రవీందర్‌‌‌‌రెడ్డి, బండి లింగారెడ్డి, సత్యనారాయణల నియమాకానికి సంబంధించిన వివరాలను ఏజీ బీఎస్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌ సీల్డ్‌‌‌‌ కవర్‌‌‌‌లో హైకోర్టుకు అందజేశారు. జీవో 54 ప్రకారమే భర్తీ చేశామని చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. దరఖాస్తులను ఆహ్వానించారా? ఏ రూల్స్‌‌‌‌ ప్రకారం భర్తీ చేశారు? చట్ట నిబంధనల అమలుపై వివరాలు ఎందుకివ్వలేదు? తదితర అదనపు కౌంటర్‌‌‌‌ దాఖలు చేయాలని రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేస్తూ, విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.