
హైదరాబాద్, వెలుగు: లాక్‌డౌన్‌తో చిన్న పరిశ్రమలు పడుతున్న కష్టాలు ఇన్నీఅన్నీ కావు. కుటీర పరిశ్రమలుగానీ, చిన్న తరహా పరిశ్రమలుగానీ, మధ్య తరహా పరిశ్రమలుగానీ.. అన్నీ సమస్యల్లో చిక్కుకున్నాయి. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ చిన్న పరిశ్రమల కోసం మూడు లక్షల కోట్లు కేటాయించామని, బ్యాంకుల ద్వారా ఈ ఇండస్ట్రీలకు ఎటువంటి గ్యారెంటీ లేకుండా లోన్లు ఇస్తామని చేసిన ప్రకటన ఈ ఇండస్ట్రియ లిస్టులకు ఇచ్చిన జోష్ ఇంతా అంతా కాదు. అయితే, బ్యాంకులు కచ్చితంగా తమకు లోన్లు ఇస్తాయా? లేదంటే ఏమన్నా కొర్రీలు పెడతాయా? అనే డౌట్ పడ్డారు వీళ్లంతా. పరిశ్రమ ఓనర్లలో ఉన్న ఈ డైలమాను తీర్చడానికి ‘వెలుగు’ ప్రయత్నం చేసింది. కొంత మంది బ్యాంకర్లతో మాట్లాడి వివరాలు రాబట్టింది. వాటిని మీ ముందుంచుతున్నాం.
తప్పకుండా లోన్లు ఇస్తాం…
‘‘కంపెనీలు చాలా కష్టాల్లో ఉన్నాయి. రైతులు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వ బ్యాంకులు తప్పక ఆదుకోవాలి. కంపెనీలకు ఇచ్చే లోన్లకు ప్రభుత్వం సహకరిస్తుంది. దీనివల్ల బ్యాంకులకు రిస్కు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మేం తప్పక లోన్లు ఇస్తాం. ప్రాజెక్టు నడుస్తుందా ? లేదా ? దరఖాస్తుదారుడి క్రెడిట్ హిస్టరీ, బాకీ చెల్లించే సత్తా వంటివాటిని లోన్ ఇచ్చే ముందు చూస్తాం. మా బ్యాంకు రైతులకు అదనంగా రూ.లక్ష వరకు రీపేయెబుల్ లోన్లు ఇస్తుంది. వీటికి వడ్డీ ఏడు శాతం వరకు ఉంటుంది. ఖరీఫ్ తరువాతే వీటిని తీర్చవచ్చు. ఈసారి వర్షాలు కూడా బాగా పడే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. లోన్ల సంఖ్య తప్పకుండా పెరుగుతుంది’’ అని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ అరవింద్ కుమార్ అన్నారు. ఎస్‌బీఐలో పనిచేసే మరో సీనియర్ ఆఫీసర్ మాట్లాడుతూ ‘‘చిన్న కంపెనీలను తప్పకుండా ఆదుకోవాలి. లోన్లు ఇవ్వడానికి మేం రెడీ. అయితే ఆ కంపెనీ లాభదాయకమనే నమ్మకం వచ్చాకే తుది నిర్ణయం తీసుకుంటాం. ‘ఈ–ముద్ర’ మాదిరి ఆన్‌లైన్‌లో మాత్రం లోన్లు జారీ చేయడం సరికాదు. ప్రాజెక్టును పూర్తిగా పరిశీలించాలి. క్రెడిట్ గ్యారంటీ, అర్హతలు, ఎవరికి ఎంత ఇవ్వాలి ? వంటి వాటిపై మాకు ఇంకా స్పష్టమైన గైడ్‌లైన్స్ రాలేదు. మా ప్రస్తుత మా బిజినెస్ కస్టమర్లకు వారి వర్కింగ్ క్యాపిటల్‌లో పది శాతం లోన్‌గా ఇస్తున్నాం. ఇది టెర్మ్‌లోన్. వడ్డీ నామమాత్రంగా ఉంటుంది. సెక్యూరిటీ కూడా అడగడం లేదు’’ అని వివరించారు.
బ్యాంకర్లు ఏమంటున్నారంటే…
ఇబ్బందుల్లో చిన్న కంపెనీలకు కేంద్రం ప్రకటించిన ఈ లోన్లు ఆక్సీజన్ వంటివని పలువురు బ్యాంకర్లు చెప్పారు. విపరీతంగా డబ్బు సమస్యలో ఉన్నవి, డిఫాల్ట్ అవుతున్న సంస్థలకు రూ. 20 వేల కోట్ల మేర ఇస్తారని చెప్పారు. ‘‘కేంద్రం నిర్ణయం వల్ల రెండు లక్షలకుపైగా కంపెనీలకు తోడ్పాటు లభించనుంది. చిన్న కంపెనీలకు చెల్లించాల్సిన రూ. లక్ష కోట్ల బకాయిలను ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు 45 రోజుల్లో విడుదల చేస్తాయి’’ అని ఒక బ్యాంకర్ వివరించారు. జీడీపీలో చిన్న కంపెనీల వాటా మూడో వంతు ఉంటుంది. వీటిలో 11 కోట్ల మందికి పైగా పనిచేస్తున్నారు.
బ్యాంకులు ఇబ్బందిపెట్టకూడదు..
కంపెనీలకు లోన్లు ఇవ్వాలన్నది తెలివైన నిర్ణయమని హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రముఖ చార్టర్డ్ ఎకౌంటెంట్ అన్నారు. అయితే బ్యాంకులు కంపెనీలను ఇబ్బందిపెట్టకూడదని సూచించారు. ‘‘కంపెనీలు గవర్నమెంటు బిల్లులను పెండింగ్‌లో పెడితే బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదు. తనఖా పెట్టినా లోన్‌ను తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. ఇది సరికాదు. కొన్ని కంపెనీలు గవర్నమెంటుకు జీఎస్టీ, ట్యాక్స్‌ల వంటివి బకాయిపడతాయి. ఇలాంటి వాటి చెల్లింపునకు కూడా లోన్లు ఇవ్వాలి. బిల్లు పెండింగ్ పేరుతో కొర్రీలు పెట్టకూడదు”అని అన్నారు.