పిల్లల్ని మింగేస్తున్న మత్తు మార్కెట్

పిల్లల్ని మింగేస్తున్న మత్తు మార్కెట్

మన దేశంలో నేడు అత్యంత ప్రమాదకరంగా పెరుగుతున్న సామాజిక విపత్తుల్లో పొగాకు,  నికోటిన్‌, గంజాయి వ్యసనాలు ముందున్నాయి. అవి ఇపుడు పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు, గురుకుల విద్యాసంస్థల వరకు చొరబడటాన్ని కట్టడిచేయాలి. 

చదువు, భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన వయస్సులో విద్యార్థులు నికోటిన్‌, మత్తు పదార్థాల వలలో చిక్కుకోవడం జరుగుతోంది. 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లల్లో 8.5 శాతం మంది ఏదో ఒక రూపంలో పొగాకు వినియోగిస్తున్నారని జాతీయ స్థాయి గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితిని కేవలం ‘చెడు అలవాటు’గా చూడటం ప్రమాదకరం. దీని వెనుక ఒక భారీ మార్కెట్ వ్యవస్థ పనిచేస్తోంది.

రంగురంగుల ప్యాకెట్లు, ఫ్లేవర్డ్ నికోటిన్ ఉత్పత్తులు, ఈ-సిగరెట్లు, సినిమాలు, సోషల్ మీడియా, వెబ్ సిరీస్‌లన్నీ యువతను లక్ష్యంగా చేసుకుని నడుస్తున్న వ్యాపార వ్యూహాలు. “స్టైల్”, “ఫ్రీడమ్”, “రిలాక్స్” పేర్లతో పిల్లల మనసుల్లో విషాన్ని నింపుతున్నారు. చదువుకునే విద్యార్థిని “భవిష్యత్ పౌరుడు”గా కాకుండా “శాశ్వత వినియోగదారుడు”గా తయారు చేస్తున్నారు. 

ప్రజల ఆరోగ్యం, యువత భవిష్యత్తు, కుటుంబాల కన్నీళ్లు - చెమట చుక్కలు, రక్తపు బొట్లు ఇవన్నీ కొందరి లాభాల కోసం తాకట్టు పెట్టబడ్డాయి. ధనవంతుల ధనదాహం కోసం పేద, మధ్యతరగతి పిల్లలు వ్యసనాల బారిన పడుతున్నారు. ప్రత్యేకంగా గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లు, సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థుల్లో ఈ అలవాట్లు పెరుగుతున్నాయన్న ఆందోళనలు ఉన్నాయి .  ఎందుకంటే విద్య ద్వారానే పైకి రావాల్సిన  తరాన్ని,  వ్యసనాల ద్వారా బలహీనపరిచే పరిస్థితి ఏర్పడుతోంది.

విద్యాసంస్థల చుట్టూ పర్యవేక్షణ అవసరం
నికోటిన్ అలవాటు చాలా సందర్భాల్లో గంజాయి వంటి మత్తు పదార్థాలకు ద్వారం అవుతోంది. మొదట గుట్కా, సిగరెట్‌, తర్వాత గంజాయి, డ్రగ్స్‌. ఇది ఇప్పుడు నగరాలకే పరిమితం కాదు. చిన్న పట్టణాలు, గ్రామాలు, విద్యాసంస్థలు కూడా ఈ వ్యాపార వలలోకి లాగబడ్డాయి. తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ సంస్థలు, పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటున్నా, క్షేత్రస్థాయిలో విద్యాసంస్థల చుట్టూ మత్తు పదార్థాల అందుబాటు తగ్గకపోవడం ఆందోళన కలిగించే విషయం.

విద్యార్థులపై ఒత్తిడి, నిరుద్యోగ భయం, భవిష్యత్తుపై అనిశ్చితి... ఇవన్నీ కలిసి మత్తు మార్కెట్‌కు అనుకూల పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ఇక్కడ అత్యంత కీలకమైన ప్రశ్నను వేయాల్సినది ఉన్నదేమంటే,  పాలక వ్యవస్థ నిజంగా ఎవరి పక్షాన ఉంది? ప్రజల ఆరోగ్యానిదా? లేక పొగాకు కంపెనీల లాభాలదా? ఒకవైపు క్యాన్సర్ ఆసుపత్రులు నిర్మిస్తూ,  మరోవైపు క్యాన్సర్‌కు కారణమయ్యే పరిశ్రమలకు  అనుమతులు ఇవ్వడం ఏవిధమైన పాలన? పిల్లలకు విషాన్ని అమ్మే కంపెనీల నుంచి పన్నులు వసూలు చేసి దానిని “ఆర్థిక అభివృద్ధి”గా చూపించడం సమాజంపై నేరం కాకపోతే మరేమిటి?

అవగాహన కల్పించాలి
కేవలం నియంత్రణలు సరిపోవు. పొగాకు పరిశ్రమలను దశలవారీగా పూర్తిగా నిషేధించే దిశగా మనదేశం ముందుకు వెళ్లాలి. పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల పరిసరాల్లో పొగాకు విక్రయాలను పూర్తిగా అడ్డుకోవాలి. గంజాయి, డ్రగ్స్ సరఫరా నెట్‌వర్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి. సినిమాలు, డిజిటల్ మీడియా ద్వారా వ్యసనాలను గ్లామరైజ్ చేసే సంస్కృతిని నియంత్రించాలి.

అదే సమయంలో విద్యాసంస్థల్లో విద్యార్థులకు మానసిక కౌన్సెలింగ్‌, ఆరోగ్య అవగాహన, క్రీడలు, కళలు, సాహిత్య కార్యక్రమాలను విస్తరించాలి. ఒత్తిడి, ఒంటరితనం, భవిష్యత్తుపై భయాలను తగ్గించే వాతావరణం లేకుండా కేవలం శిక్షలతో సమస్య పరిష్కారం కాదు.

పుస్తకాలు పట్టాల్సిన చేతుల్లో విషపు ప్యాకెట్లు పెట్టే వ్యవస్థ ఏ నాగరిక సమాజానిదీ కాదు. యువతను వ్యసనాల్లోకి నెట్టే మార్కెట్ శక్తులపై మనదేశం యుద్ధం ప్రకటించాలి. లేదంటే రేపటి తరాలు కాదు, మొత్తం సమాజమే ఈ విష సంస్కృతికి బలి అవుతుంది.

పి.రేణుక, భూంపల్లి, ఫూలే బీసీ గురుకుల గెస్ట్ ఫ్యాకల్టీ