గురుకులాలు సిద్ధమేనా?

గురుకులాలు సిద్ధమేనా?

విద్యా సంస్థలను జులై 1 నుంచి తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఫిబ్రవరిలో ఇలాగే స్కూళ్లు, కాలేజీలను తెరిస్తే కరోనా విజృంభించింది. కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో మొత్తం విద్యావ్యవస్థకు మార్చి నుంచి తాళం వేయవలసి వచ్చింది. ఈ మూడు నెలల్లో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల్లో కరోనా నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియని పరిస్థితి. చిన్నారులు విద్యా సంవత్సరం నష్టపోకూడదని, ఆన్ లైన్ ఎడ్యుకేషన్​ కొందరు విద్యార్థులకే అందుతున్న నేపథ్యంలో ప్రత్యక్ష బోధనకు వెళ్లాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం స్వాగతించేదే అయినా పాత సమస్య మళ్లీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటే బాగుండేది. ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా ఒక ప్రత్యేక పద్దు కింద అన్ని విద్యా సంస్థలకు నిధులు కేటాయించి కనీస అవసరాలైన మంచి నీరు, బాత్​రూమ్స్, ప్రతి స్కూల్​కు ఒక పూర్తి స్థాయి వైద్య బృందం, మాస్కులు, శానిటైజర్ లాంటి వాటిని సమకూర్చాలి. కింది స్థాయి పిల్లలకు కరోనాపై ఎక్కువ అవగాహన ఉండదు గనుక ఒక కౌన్సిలర్ ను కూడా ఏర్పాటు చేయాలి.

అలాకాకుంటే మొదట 9, 10 తరగతులను ప్రారంభించి, పరిస్థితులను బట్టి దశలవారీగా మిగిలిన తరగతులను ప్రారంభించేలా ప్రణాళికలను రూపొందించడం మంచిది. రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ బడుల్లో టీచర్లకే సరైన వసతులు లేవు. అటువంటి స్కూళ్లలో విద్యార్థుల సంక్షేమం ప్రశ్నార్థకమే. స్కూళ్లు, గురుకులాలను కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా విద్యా శాఖ అధికారులు పరిశీలించి అవసరమైన వసతులపై ఒక రిపోర్ట్ తయారు చేసేలా విద్యాశాఖ ఆదేశాలు జారీచేయాలి. అన్ని జిల్లాల నివేదికలను బట్టి విద్యా సంస్థల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి. ఆ తర్వాతే స్కూళ్లలో ప్రత్యక్ష బోధనను అమలు చేస్తే మంచి ఫలితాలను రాబట్టవచ్చు.                   - ఎండీ ఖ్వాజా మొయినొద్దీన్, కరీంనగర్