
- ప్రజాప్రతినిధుల దగ్గరి బంధువులకూ ఇవ్వొద్దు
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకే ప్రయార్టీ
- డీసీసీ చీఫ్ లకు మీనాక్షీ నటరాజన్ కీలక సూచన
హైదరాబాద్: ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులుగా ఉన్న వాళ్లకు మళ్లీ చాన్స్ ఇవ్వవద్దని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇన్ చార్జి మీనాక్షి నజరాజన్ సూచించారు. ఇవాళ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో కలిసి డీసీసీ అధ్యక్షులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ సూచనలను వివరించారు. డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకొనే వారు కనీసం ఐదేండ్ల పాటు నిరంతరాయంగా కాంగ్రెస్ సభ్యుడిగా క్రమశిక్షణతో ఉండాలన్నారు. అలా లేని వారిని ఏఐసీసీ పరిశీలకులు తొలగిస్తారని చెప్పారు.
ఇప్పుడు పనిచేసే డీసీసీ అధ్యక్షులకు రెండో సారి ఎట్టి పరిస్థితిలోనూ అవకాశం ఉండదని అన్నారు. పార్టీ ప్రజాప్రతినిధుల దగ్గరి బంధువులకు కూడా చాన్స్ ఉండదని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా నాయకులకు ప్రాధాన్యం ఉంటుందని వివరించారు. ఏఐసీసీ పరిశీలకులతో నాయకులు వ్యక్తిగత సంభాషణలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు.
జిల్లాల్లోని సమావేశాలు అక్కడి నాయకుల ఇండ్లలో గాని వారి వ్యక్తిగత కార్యాలయాల్లో గానీ పెట్టవద్దని సూచించారు. పార్టీ కార్యాలయంలో లేదా అందరికీ అందుబాటులో ఉండే ప్రాంతంలో నిర్వహించాలని సూచించారు. అలాగే ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓట్ చోరీ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో కనీసం వంద మంది సంతకాలు చేయించి పంపించాల్సి ఉంటుందని అన్నారు.