వామ్మో వెండి.. ఒక్కరోజే రూ.7,500 పెరిగింది.. ఆల్ టైం హైకి చేరిన సిల్వర్ ధర

వామ్మో వెండి.. ఒక్కరోజే రూ.7,500 పెరిగింది..  ఆల్ టైం హైకి చేరిన సిల్వర్ ధర

న్యూఢిల్లీ: వెండి ధరల దూకుడు ఆగడం లేదు. సోమవారం రూ.7,500 పెరిగింది. కిలో ధర రూ. 1.79 లక్షలకు చేరి కొత్త రికార్డును తాకింది. శుక్రవారం ధర రూ. 1,71,500 వద్ద ముగిసింది. బంగారం ధరలూ దూసుకెళ్లాయి. డిమాండ్ ​పెరుగుతూనే ఉండటంతో సోమవారం జాతీయ రాజధానిలో పది గ్రాముల బంగారం ధర రూ. 1,950 పెరిగి, రూ. 1,27,950 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది. శుక్రవారం ఇది రూ. 1.26 లక్షల వద్ద ముగిసింది. 

అమెరికా కొన్ని చైనా ఉత్పత్తులపై 100 శాతం సుంకం పెంపును ప్రకటించడం, అరుదైన ఖనిజాల ఎగుమతిని నిలిపివేస్తామని చైనా బెదిరించడంతో ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితిని పెంచింది.ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెట్టుబడిదారుల నుంచి బలమైన డిమాండ్ కారణంగా బంగారం ధరల డిమాండ్ ​ఎగిసిందని నిపుణులు పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ దాదాపు 2 శాతం పెరిగి ఔన్స్​కు (28.3 గ్రాములు) కొత్త రికార్డు గరిష్టమైన 4,084.99 డాలర్లను తాకింది.

స్పాట్ సిల్వర్ 3 శాతం పెరిగి ఔన్స్​కు 51.74 డాలర్లతో కొత్త గరిష్టాన్ని అందుకుంది. పండుగల డిమాండ్, సరఫరా కొరత, ప్రపంచ సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు బంగారం, వెండి ధరలు రికార్డుస్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణాలు. ఈ నెల చివర్లో, డిసెంబర్​లో ఫెడ్​ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలూ వెండి ర్యాలీకి బలాన్ని చేకూరుస్తున్నాయి.

2026 నాటికి బంగారం రూ. 1.5 లక్షలు!

పసిడి పరుగు ఇక ముందూ కొనసాగుతుందని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. ఈ ధనత్రయోదశి నాటికి పది గ్రాముల ధర రూ. 1.30 లక్షలకు చేరే అవకాశం ఉంది. 2026 ప్రారంభం నాటికి ఇది రూ. 1.50 లక్షల వరకు కూడా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. గ్లోబల్​ మార్కెట్లలో ఆర్థిక అనిశ్చితి, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాల కారణంగా బంగారం ధరలు ఈ ఏడాది పెరుగుతూనే ఉన్నాయి.  

ఎంసీఎక్స్ లో డిసెంబర్ కాంట్రాక్ట్ ఇప్పటికే రూ. 1,22,284 ను తాకింది. యూఎస్, చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సోమవారం ఎంసీఎక్స్ లో పది గ్రాముల బంగారం 1.62 శాతం పెరిగి రూ. 1,23,313 వద్ద ట్రేడ్ అయింది. స్పాట్ గోల్డ్  ఔన్స్​ ధర ఏకంగా 4,060 డాలర్లకు చేరి రికార్డు గరిష్టాన్ని తాకింది. యూఎస్ డాలర్ బలహీనపడటం డిమాండ్‌‌‌‌ను మరింత పెంచుతోంది.

యూఎస్, చైనా టారిఫ్​ రోజురోజుకూ ముదురుతూనే ఉండటంతో విలువైన లోహాలు ర్యాలీ చేస్తున్నాయి. కొత్త సుంకాలతో బెదిరించడం మానేసి, చర్చలకు తిరిగి రావాలని చైనా ఆదివారం యూఎస్‌ను కోరింది. కొత్తగా టారిఫ్​లు  విధిస్తే ప్రతీకారం ఉంటుందని హెచ్చరించింది.  చైనా వస్తువులపై 100 శాతం సుంకాలను విధిస్తానని ఇంతకుముందు హెచ్చరించిన యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా కొంత మెత్తబడ్డట్టు తెలుస్తోంది.