ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా.. భగ్గుమంటున్న పాకిస్తాన్

ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా..  భగ్గుమంటున్న పాకిస్తాన్
  • ఇజ్రాయెల్  వ్యతిరేక ప్రదర్శనలో హింస
  • ఐదుగురు నిరసనకారులు, పలువురు పౌరులు కూడా మృతి

ఇస్లామాబాద్: ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రదర్శనలతో పాకిస్తాన్​లోని పంజాబ్  ప్రావిన్స్  భగ్గుమంటోంది. ఇజ్రాయెల్, పాక్  ప్రభుత్వానికి వ్యతిరేకంగా, గాజాకు అనుకూలంగా తెహ్రీకే లబ్బాయిక్  పాకిస్తాన్ (టీఎల్పీ) కార్యకర్తలు పంజాబ్  ప్రావిన్స్ లోని మురిడ్కేలో చేపట్టిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. టీఎల్పీ చీఫ్  సాద్  హుస్సేన్  రిజ్వీ నేతృత్వంలో ఆందోళనకారులు ర్యాలీగా వెళ్తుండగా.. భద్రతా బలగాలు వారిని అడ్డుకునేందుకు యత్నించాయి. 

దీంతో ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బలగాలపై టీఎల్పీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. పాకిస్తాన్  రేంజర్లు కూడా నిరసనకారులకు మద్దతు తెలిపారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో ఆందోళనకారులపై బలగాలు లాఠీచార్జి చేశాయి. టియర్ గ్యాస్  ప్రయోగించాయి. అయినా కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. 

బారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లిన ఆందోళనకారులు.. పోలీసులపై దాడికి దిగారు. దీంతో బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు టీఎల్పీ కార్యకర్తలు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 

టీఎల్పీ కార్యకర్తల వల్లే హింస: బలగాలు

టీఎల్పీ కార్యకర్తల వల్లే హింస జరిగిందని భద్రతా బలగాలు ఆరోపించాయి. నిరసనకారులే ముందుగా తమపై రాళ్లదాడికి పాల్పడ్డారని, అంతేకాకుండా పెట్రోల్ బాంబులు విసిరారని, విచక్షణారహితంగా కాల్పులు కూడా జరిపారని భద్రతా అధికారులు చెప్పారు. వారు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారితో పాటు పలువురు 
పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.