
బెంగళూరు: పెళ్లైన ఐదు నెలలకే భార్యను భర్త చంపేసిన ఘటన కర్నాటకలోని చిక్మగళూరులో జరిగింది. ఆదివారం అర్ధ రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మ్యాట్రిమొనియల్ వెబ్సైట్ ద్వారా ఈ ఇద్దరికీ పరిచయమైంది. ఇరు కుటుంబాలు కట్న కానుకలు అన్నీ మాట్లాడుకుని నవీన్కు, నేత్రావతికి వివాహం చేశారు.
వీరికి పెళ్లి జరిగిందే గానీ శారీరకంగా కలిసేందుకు నేత్రావతి ఒప్పుకోలేదు. పెళ్లయిన పదిహేను రోజులకే భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. నేత్రావతి పుట్టింటికి వెళ్లిపోయింది. నవీన్, అతని కుటుంబం అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ పరిణామాలతో నవీన్ భార్యపై మరింత ద్వేషం పెంచుకున్నాడు.
పెళ్లయిన పదిహేను రోజులకే గొడవ పడి వెళ్లిపోవడం, శారీరకంగా కలిసేందుకు ఒప్పుకోకపోవడం.. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నేత్రావతిపై నవీన్ రగిలిపోయాడు. భార్యాభర్తల మధ్య రాజీ కుదిర్చేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ పరిణామాలతో పాటు విడాకులు కోరుతూ తన భార్య నోటీసులు పంపడంతో నవీన్ కోపం పీక్స్ కు చేరింది. భార్యను చంపాలని నిర్ణయించుకుని నేత్రావతి పుట్టింట్లో ఎవరూ లేని విషయం తెలుసుకుని నేరుగా నేత్రావతి తల్లి ఇంటికి నవీన్ వెళ్లాడు. కత్తితో భార్యను పొడిచి చంపేశాడు. ఆమెను ఇరుగుపొరుగు వాళ్లు ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో నేత్రావతి చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు.