బస్సులో దీపావళి టపాసులు.. ఏసీ స్లీపర్ రన్నింగ్ బస్సులో మంటలు.. 19 మంది సజీవ దహనం

బస్సులో దీపావళి టపాసులు.. ఏసీ స్లీపర్ రన్నింగ్ బస్సులో మంటలు.. 19 మంది సజీవ దహనం

రాజస్థాన్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైవేపై రన్నింగ్లో ఉన్న ఏసీ స్లీపర్ బస్సులో ఉన్నట్టుండి మంటలు రేగాయి. బస్సులో ప్రయాణికులు గమనించి దిగే లోపే ఘోరం జరిగిపోయింది. 19 మంది ప్రయాణికులు బస్సులో సజీవ దహనం అయి ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ప్రయాణికులు బస్సులో నుంచి ప్రాణాలతో బయటపడినప్పటికీ మంటల్లో శరీరం కాలిపోయి తీవ్రంగా గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. బస్సులో మంటలను గుర్తించిన వెంటనే రన్నింగ్ బస్సులో నుంచి దూకేసి కొందరు ప్రయాణికులు ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. అలా కొందరు గాయపడ్డారు. ఈ బస్సులో మొత్తం 57 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నట్లు తెలిసింది.

షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. అంతేకాకుండా.. బస్సులో దీపావళి టపాసులు కూడా ఉన్నట్లు తెలిసింది. అందుకే నిప్పంటుకున్న కొద్దిసేపటికే బస్సు మంటల్లో పూర్తిగా తగలబడిపోయింది. గాయపడిన వారిని జైసల్మేర్ లోని ఆసుపత్రుల్లో చేర్పించారు. ప్రయాణికులను అంబులెన్స్ ల్లో ఆసుపత్రులకు తరలించారు. ఈ బస్సు ప్రమాద ఘటనపై సీఎం భజన్ లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. థాయత్ అనే గ్రామం సమీపంలో ఈ బస్సు ప్రమాదం జరిగింది. జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తున్న బస్సుగా అధికారులు తెలిపారు. జైసల్మేర్ నుంచి బస్సు మొదలైన 20 కిలోమీటర్లకే బస్సు మంటల్లో చిక్కుకుపోయింది. నిమిషాల్లోనే అంత పెద్ద బస్సు కాలి బూడిదైంది.