Bengaluru Namma Metro: మెట్రో రైలులో బెగ్గింగ్ ఏంటయ్యా.. అనుమతి ఉండదుగా.. ఎలా జరిగిందంటే..

Bengaluru Namma Metro: మెట్రో రైలులో బెగ్గింగ్ ఏంటయ్యా.. అనుమతి ఉండదుగా.. ఎలా జరిగిందంటే..

ప్యాసింజర్ రైళ్లలో భిక్షాటన చేసే వాళ్లు కనిపిస్తుంటారు. ఇందులో వింతేం లేదు. కానీ.. మెట్రో రైళ్లలో భిక్షాటన మాత్రం నెట్టింట రచ్చ లేపింది. తీవ్ర చర్చకు దారితీసింది. బెంగళూరు మెట్రో రైలులో ఒక వ్యక్తి భిక్షాటన చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది. మెట్రో రైలులో ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా టికెట్ తీసుకోవాలి. ప్లాట్ ఫాం దగ్గరకు వెళ్లి రైలు ఎక్కాలి. ఈలోపు ఎక్కడా కూడా ఆ బెగ్గర్ అడుక్కోలేదు. 

మెట్రో రైలు ఎక్కాకే తన పనిని మొదలుపెట్టాడు. బెంగళూరులో BMTC, KSRTC బస్ స్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, మార్కెట్‌లలో భిక్షాటన చేసే వాళ్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఇప్పుడు ఏకంగా బెంగళూరు మెట్రో రైలులో కూడా భిక్షాటన చేస్తున్న దృశ్యాలు బెంగళూరు నగరవాసులను విస్మయానికి గురిచేశాయి.

బెంగళూరు మెజెస్టిక్, యశ్వంత్‌పూర్ మధ్య గ్రీన్ లైన్‌లో వెళుతున్న మెట్రో రైలులో ప్రయాణికుల నుంచి ఒక వ్యక్తి డబ్బులు అడుక్కుంటున్న ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. మెట్రో ప్రయాణికులు స్వయంగా దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి తమ నిరసనను వెళ్లగక్కారు. 

గతంలో కూడా బెంగళూరు మెట్రో రైలులో ఒక వ్యక్తి భిక్షాటన చేస్తూ కనిపించాడు. కొప్పల్‌కు చెందిన మల్లికార్జున్ అనే 20 ఏళ్ల యువకుడు తాను చెవిటివాడినని, మూగవాడినని, దయచేసి తనకు సాయం చేయాలని.. కార్డులపై రాసి వాటిని మెట్రో రైలులోని అందరికీ పంచుతూ భిక్షాటన చేశాడు. మెట్రో రైలులో భిక్షాటన నిషేధం. అయినప్పటికీ.. ప్రయాణికులను ఇబ్బంది పెట్టినందుకు అతనికి 500 రూపాయల జరిమానాను విధించారు.