- అట్లైతే పిల్లలు, వృద్ధులపైనా వేధింపులు ఎందుకు జరుగుతున్నయ్?
- నటుడు శివాజీని ప్రశ్నించిన మహిళా కమిషన్
- తన వ్యాఖ్యలపై కమిషన్కు శివాజీ వివరణ
హైదరాబాద్, వెలుగు: వస్త్రధారణే మహిళలపై వేధింపులకు కారణమైతే... అభంశుభం తెలియని పిల్లలు, వృద్ధ మహిళలపై లైంగిక దాడులు ఎలా జరుగుతున్నాయని నటుడు శివాజీని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ప్రశ్నించారు. ‘‘నిండుగా చీర కట్టుకొని ఫంక్షన్లకు వచ్చిన నటీమణులు కూడా ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? ఈవెంట్లలో హీరోయిన్లకు రక్షణ కల్పించాల్సింది పోయి.. వాళ్ల బట్టల గురించి కామెంట్ చేస్తారా? ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడాల్సిన బాధ్యత లేదా?’’ అని శివాజీపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇటీవలే దండోరా సినిమా ప్రమోషన్ సందర్భంగా నటీమణుల దుస్తులపై శివాజీ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్.. ఆయనను విచారణకు పిలిపించింది. దీంతో శనివారం బుద్ధభవన్ లోని కమిషన్ ఎదుట శివాజీ హాజరయ్యారు. తాను చేసిన వ్యాఖ్యలకు శివాజీ వివరణ ఇచ్చారు.
కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద శివాజీ నుంచి వివరణ తీసుకునే క్రమంలో కొన్ని ప్రశ్నలు అడిగారు. ‘‘శివాజీ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. తన తప్పును ఆయన అంగీకరించారు. తన వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇకమీదట మహిళల గురించి మాట్లాడేటపుడు, ప్రవర్తించేటపుడు మర్యాదగా నడుచుకుంటానని పేర్కొన్నారు. అలాగే.. సినిమాలలో తనకి అవకాశం ఉన్న మేరకు మహిళా కమిషన్ సూచన మేరకు మార్పులు చేర్పులు చేసుకుంటాను’’ అని శివాజీ చెప్పినట్లు మహిళా కమిషన్ పేర్కొంది.
నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నరు: శివాజీ
మహిళలపై తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని శివాజీ క్లారిటీ ఇచ్చారు. మహిళా కమిషన్ విచారణ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. కొందరు జూమ్ మీటింగ్ లు పెట్టుకొని తనను ఎలా ఇబ్బంది పెట్టాలో చర్చిస్తున్నారని చెప్పారు. ‘‘నాతో కెరీర్ మొదలుపెట్టిన వాళ్లే నాపై ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. నా వాళ్లే ఇలా చేస్తారని ఊహించలేదు.
ఇంట్లో పిల్లలకు అమ్మానాన్న జాగ్రత్తలు చెప్పినట్లే నేను మాట్లాడాను తప్ప ఎవరినీ కించపరచడం నా ఉద్దేశం కాదు. దొర్లిన తప్పు పదాలకు కమిషన్ కు క్షమాపణలు చెప్పాను. వివరణ ఇచ్చాను. ఈ సందర్భంగా కమిషన్ పలు సూచనలు చేసింది. సెలబ్రిటీలుగా, ఇన్ ఫ్లుయెన్సర్లుగా ఉన్నవారు సమాజంలో బాధ్యతాయుతంగా ఉండాలని, మహిళలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని కమిషన్ సూచించింది” అని శివాజీ వెల్లడించారు.
