
న్యూఢిల్లీ, వెలుగు: ప్రజలు కట్టిన పన్నులతోనే ప్రభుత్వాన్ని నడుపుతామన్న తెలంగాణ సర్కార్ ఆలోచన మంచిది కాదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ఆర్థిక నిధులు సమకూర్చుకునేందుకు వేరే మార్గాలను అన్వేషించరా? ప్రజలు పన్నుల రూపంలో ఇచ్చిన డబ్బులతో ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలని భావిస్తున్నారా అని ప్రశ్నించారు.
బుధవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. దేశంలో జీఎస్టీ 2.0 సంస్కరణలతో దేశ ఆర్థిక అభివృద్ధికి ఊతం పడిందని, అయితే, జీఎస్టీ సంస్కరణల వల్ల తెలంగాణకు రూ.7 వేల కోట్ల నష్టం జరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనడం సరికాదన్నారు.
ప్రధాని మోదీ తీసుకొచ్చిన సంస్కరణలతో దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు పన్నుల రూపంలో వసూలు చేసిన దోపిడీ నుంచి దేశ ప్రజలకు విముక్తి కలిగిందన్నారు. పన్నుల తగ్గింపుతో దీపావళికి ముందే అందరి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చిందన్నారు. గతంలో 17 రకాల పన్నులు ఉండేవని, ప్రధాని మోదీ దూరదృష్టితో ఆలోచన చేసి ఒకే దేశం, ఒకే పన్ను విధానానికి తెరలేపారని వెల్లడించారు.