వెబ్‌‌ సిరీస్‌‌లు తెగ చూస్తున్నరా!

వెబ్‌‌ సిరీస్‌‌లు తెగ చూస్తున్నరా!

ఓటీటీల్లో వచ్చే సిరీస్‌‌లు, సినిమాలు చూసేందుకు చాలామంది జనాలు టీవీల ముందు నుంచి కదలటం లేదు. గంటల తరబడి ఇంట్లోనే కూర్చొని టీవీలకు అతుక్కుపోతున్నారు. అయితే దీనివల్ల మానసికంగా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది అంటోంది సైకియాట్రిస్ట్‌‌ డాక్టర్‌‌‌‌ జ్యోతి కపూర్‌‌‌‌. నెట్‌‌ఫ్లిక్స్‌‌ చేసిన సర్వే ప్రకారం నెట్‌‌ఫ్లిక్స్‌‌లో అరవై ఒక్కశాతంమంది రోజులో కనీసం రెండు నుంచి ఆరు ఎపిసోడ్‌‌ల వరకు చూస్తున్నారట. కూర్చున్న దగ్గర్నుంచి కదలకుండా అన్నేసి గంటలు ఉండటం వల్ల శరీరానికి ఫిజికల్‌‌ యాక్టివిటీ ఉండట్లేదు. దానివల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశాలు పెరుగుతున్నాయి.

  • టీవీ షోను లేవకుండా ఒకే దగ్గర కూర్చొని రోజూ చూస్తున్నారనుకోండి.. ప్రపంచం నుంచి దూరంగా ఉన్నట్టు, అందరూ వదిలేసిన ఫీలింగ్‌‌ వస్తుంది. దాంతో ‘నేను ఒంటరిని. నాకు ఎవ్వరూ లేరు’ అనే డిప్రెషన్‌‌లోకి వెళ్లి ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌‌ని దూరం పెడతారు.  
  • మనిషి ఆరోగ్యంగా ఉండటానికి నిద్ర చాలా అవసరం. కానీ, ఈ మధ్య గంటల తరబడి టీవీలకు అతుక్కుపోవడం వల్ల చాలామందిలో నిద్రలేమితో (ఇన్‌‌సోమ్నియా) పాటు రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నట్టు ఒక స్టడీలో తేలింది. వాటితోపాటు మానసిక ఒత్తిడి, అలసట కూడా వస్తున్నాయి. 
  • స్క్రీన్ ఎక్కువసేపు చూసేవాళ్లలో కాగ్నిటివ్‌‌ ప్రాబ్లమ్స్‌‌ వస్తాయి. అలసటగా అనిపించడంతో పాటు ఏ విషయంపైనా ఏకాగ్రత చూపెట్టలేరు. సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు. ఆలోచనా శక్తి తగ్గుతుంది. డిప్రెషన్‌‌, యాంగ్జైటీ ఎక్కువయ్యే అవకాశం ఉంది. 
  • టీవీ ఎక్కువ చూసేవాళ్ల ప్రవర్తనలో మార్పులు వస్తాయి. చిన్న విషయాలకు కూడా కోపగించుకోవడం,  అరవడం, చికాకుపడటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకే దగ్గర కూర్చోవడం వల్ల శరీరానికి ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ ఉండదు. దాంతో బీపీలు పెరుగుతాయి. ఒబేసిటీ, గ్యాస్టిక్‌‌ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.