ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్.. ఇద్దరు ఏం మాట్లాడుకున్నారంటే..?

ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్.. ఇద్దరు ఏం మాట్లాడుకున్నారంటే..?

న్యూఢిల్లీ: ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం (మార్చి 24) ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు చర్చించారు. అలాగే, హార్ముజ్‌ జలసంధిలో చమురు రవాణాపై ఇరాన్ ఆంక్షలపైనా ట్రంప్, మోడీ డిస్కస్ చేశారు. ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్ చేసిన విషయాన్ని భారత్‎లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ‘‘ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడే మోడీతో ఫోన్‎లో మాట్లాడారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న పరిస్థితులు, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం గురించి ఇద్దరూ చర్చించారు’’ అని గోర్ తెలిపారు. 

ట్రంప్‎తో ఫోన్‎లో మాట్లాడిన విషయాన్ని ప్రధాని మోడీ కూడా ధృవీకరించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్ట్ పెట్టారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై ట్రంప్‎తో ఫోన్‎లో మాట్లాడానని.. ఇరువురి మధ్య ఉపయోగకరమైన సంభాషణ జరిగిందని తెలిపారు. మిడిల్ ఈస్ట్‎లో ఉద్రిక్తతలను తగ్గించడం, శాంతిని త్వరగా పునరుద్ధరించడం వంటి వాటికి భారతదేశం మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని తెరిచి సురక్షితంగా అందుబాటులో ఉంచడం అత్యంత కీలకమని నొక్కిచెప్పారు.

►ALSO READ | భారత్లో చమురు నిల్వలపై వాస్తవం వెలుగులోకి.. పది రోజులకు సరిపడా ఉంది: పెట్రోలియం శాఖ

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో గత నాలుగు వారాలుగా మిడిల్ ఈస్ట్ రణరంగంగా మారిన విషయం తెలిసిందే. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతీదాడులు చేస్తుండటంతో మిడిల్ ఈస్ట్ రగిలిపోతుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు కౌంటర్‎గా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జల సంధిని ఇరాన్ క్లోజ్ చేసింది. అలాగే గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, ముడి చమురు తయారీ, రవాణా కేంద్రాలపై ఇరాన్ దాడులతో విరుచుకుపడుతోంది. 

ఇరాన్ దాడులు, హార్మూజ్ జల సంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. హార్మూజ్ మూసివేతతో గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎరువుల రవాణాకు కూడా ఆటంకం ఏర్పడింది. దీంతో హార్మూజ్ జల సంధి తిరిగి తెరిచి చమురు రవాణాకు సహకరించాలని ప్రపంచ దేశాలకు ట్రంప్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే వివిధ దేశాధినేతలతో అమెరికా అధ్యక్షుడు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు.