
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీఅర్ఎస్ నేతల మధ్య వాగ్వాదంతో పరస్పర విమర్శలు చేసుకుంటూ.. ఒకరినొకరు తోసుకోవడంతో తోపులాట జరిగింది. వివరాల్లోకి వెళితే..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని తహసీల్దార్ సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం(జనవరి 3) గ్రామ సర్పంచ్ బాలమణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరణను పరిశీలించడానికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పంచాయతీ కార్యాలయానికి వచ్చారు.
బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ లు కలిసి మాట్లాడుతుండగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య మాటల యుద్ధం జరిగింది. అంతటితో ఆగకుండా ఒకరినొకరు తోసుకోవడంతో అక్కడ తోపులాట జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో వివాదం సద్దుమణిగింది.