భార్యతో గొడవ.. ఇల్లు కాలబెట్టిన భర్త ..

భార్యతో గొడవ.. ఇల్లు కాలబెట్టిన భర్త ..
  •      మంచం, చద్దర్లకు నిప్పు పెట్టడంతో పేలిన గ్యాస్​సిలిండర్​
  •     ఎగిరి రోడ్డుపై పడ్డ పైకప్పు 
  •     ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం

ఆత్మకూరు వెలుగు : హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ గ్రామానికి చెందిన ఓ భర్త భార్యతో గొడవ పడి ఆగ్రహంతో ఇంటికి నిప్పు పెట్టాడు. గూడెప్పాడ్​కు చెందిన మహమ్మద్ అక్తర్ పాషాకు వరంగల్ జిల్లా ఖిలా వరంగల్​లోని గాడిపల్లి గ్రామానికి చెందిన హజీమాతో పెండ్లయ్యింది. వీరికి కూతురు, కొడుకు ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తలు ప్రతి విషయానికి గొడవ పడుతున్నారు. ఆదివారం కూడా ఇద్దరూ లొల్లి పెట్టుకున్నారు. దీంతో కోపానికి గురైన పాషా ఇంట్లోని మంచం, చద్దర్లు ఒక దగ్గర వేసి నిప్పంటించాడు. మంటలు చెలరేగడంతో ఇంట్లోని వస్తువులన్నీ అంటుకున్నాయి. 

ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్​ పేలడంతో పైకప్పు ఎగిరి రోడ్డుపై పడింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలు ఆర్పారు. ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుమారు రూ. 2 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.