ఖమ్మం బీఆర్​ఎస్​లో గ్రూపుల లొల్లి

 ఖమ్మం బీఆర్​ఎస్​లో గ్రూపుల లొల్లి

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు:  ఖమ్మం వేదికగా పార్టీ ఆవిర్భావ సభను అట్టహాసంగా నిర్వహించేందుకు ఓవైపు రూలింగ్​పార్టీ రెడీ అవుతుండగా, మరోవైపు అదే ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్​లో గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరాయి. ఎమ్మెల్యేల తీరుపై పార్టీలో అసమ్మతి రోజు రోజుకూ పెరిగిపోతోంది. బీఆర్ఎస్​ సభ సన్నాహక సమావేశాలకూ కొందరు నేతల దూరంగా ఉండడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పాలేరులో తుమ్మల, ఉపేందర్​రెడ్డి వర్గాల నడుమ పోరు తెలిసిందే. కానీ వైరా, ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాల్లోనూ తాజాగా గ్రూపు రాజకీయాలు రచ్చకెక్కుతున్నాయి. సభ సక్సెస్​ కోసం ఇల్లెందు నియోజకవర్గంలో మూడు రోజుల కింద నిర్వహించిన సన్నాహక కమిటీ సమావేశానికి  జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్యను పిలువలేదు. ఇక కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లోనైతే అధికార బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు రెండు గ్రూపులుగా విడిపోయి కయ్యానికి కాలుదువ్వుతున్నారు. దీనిపై క్యాడర్​లో అయోమయం నెలకొంది.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలపై పలువురు నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఈ మధ్య నిర్వహించిన కార్యక్రమాలకు పలువురు నేతలు దూరంగా ఉంటున్నారు. కొత్తగూడెంలో సీఎం కేసీఆర్​ పర్యటనతో పాటు ఖమ్మంలో జరగనున్న బీఆర్ఎస్​ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నిర్వహించిన సన్నాహక సమావేశాలకు దాదాపు 12 మందికి పైగా కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. మున్సిపల్​చైర్మన్, ఎమ్మెల్యే ఒక్కటై తమ వార్డుల్లో అభివృద్ధి పనుల గురించి పట్టించుకోవడం లేదని, సమస్యల గురించి చెప్పినా వినిపించుకోవడం లేదని  ఆరోపిస్తున్నారు. 12 వతేదీన, 16న  సమావేశాలు పెట్టినా వెళ్లకుండా విడిగా సమావేశాలు పెట్టుకుని జనాలను తరలించేందుకు ప్లాన్​చేస్తున్నారు. మున్సిపాలిటీ కౌన్సిల్​మీటింగ్​లలోనూ అధికార పార్టీ కౌన్సిలర్లే ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. ఇల్లెందు నియోజకవర్గంలోనూ మూడు రోజుల కింద బీఆర్ఎస్​ఆవిర్భావ సభ కోసం మీటింగ్​పెట్టినా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడైన రేగా కాంతారావు...జడ్పీ చైర్మన్​కోరం కనకయ్యను పిలవలేదు. సీఎం ప్రోగ్రామ్​ తర్వాత సీఎం టీఆర్ఎస్​ఆఫీసుకు రాగా కోరం లేడన్న విషయం తెలుసుకున్న మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి ఆయనకు కాల్​చేశారు. ప్రోగ్రాంకు రావాలని కోరగా, పార్టీ జిల్లా అధ్యక్షుడు పిలవకుండా అవమానించారని చెప్పి వెళ్లలేదు. ఇప్పటికే ఇల్లెందు ఎమ్మెల్యే భానోత్​హరిప్రియ, జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్యల మధ్య వర్గ పోరు నడుస్తోంది. పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వర్​ రావులు మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వరరావు, జలగం వెంకట్రావ్​లను శత్రువులుగానే చూస్తున్నారు. విప్​రేగా కాంతారావుపై పాయం వెంకటేశ్వర్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్​ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పార్టీ మారే అవకాశం ఉందనే ప్రచారంతో ఆయనతో తిరిగే కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, ఆళ్ల మురళి, తూం చౌదరి, సాంబమూర్తి, తుళ్లూరు బ్రహ్మయ్య  లాంటి లీడర్లను ఎమ్మెల్యేలు పక్కన పెడుతున్నట్టు తెలుస్తోంది.  

ఖమ్మం జిల్లాలోనూ ఇదే పరిస్థితి..

ఖమ్మం జిల్లాలో ప్రధానంగా పాలేరు, వైరా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ లో వర్గపోరు ఉంది. వైరాలో ఇటీవల జరిగిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే రాములు నాయక్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు మదన్ లాల్, చంద్రావతి ఒకే వేదికపై కనిపించారు. రీసెంట్ గా రాములు నాయక్  నిర్వహించిన బైక్ ర్యాలీలో రాములు నాయక్ తో పాటు చంద్రావతి కలిసి పాల్గొన్నారు. కానీ మదన్ లాల్ కనిపించలేదు. మరోవైపు నియోజకవర్గంలోని ఐదు మండలాల వారీగా తన వర్గానికి చెందిన వారితో సమావేశాలు జరిపి, 18న మీటింగ్ కు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇక పాలేరు లో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గాల మధ్య విభేదాలున్నాయి. పాలేరు నియోజకవర్గంలో జరిగిన ఏ సన్నాహక సమావేశానికి కందాలతో కలిసి తుమ్మల హాజరుకాలేదు. సత్తుపల్లి, ఇల్లందు, అశ్వారావుపేట, కొత్తగూడెంలో జరిగిన సన్నాహక సమావేశాల్లో మాత్రం పాల్గొన్నారు. అయితే సోమవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో మాత్రం ఒకే వేదికపై తుమ్మల, కందాల కలిసి పాల్గొన్నారు. అంతకు ముందు సోమవారం ఉదయం పాలేరు నియోజకవర్గంలోని తన వర్గం నాయకులతో తన ఇంట్లో తుమ్మల ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పబ్లిక్ మీటింగ్ కు తరలిరావాలని, భారీగా జనాన్ని సమీకరించాలని లీడర్లను ఆదేశించారు. దీంతో ఈ ఇద్దరి మధ్య విభేదాలున్నాయన్నది మరోసారి స్పష్టమైంది.