విద్యుత్ ప్రాజెక్టులపై వాదనలు..లిఖితపూర్వకంగా సమర్పించండి

విద్యుత్ ప్రాజెక్టులపై వాదనలు..లిఖితపూర్వకంగా సమర్పించండి
  •    ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశం 

న్యూఢిల్లీ, వెలుగు :  కృష్ణా నది పరివాహక ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్‌‌ కేంద్రాలను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్‌‌ఎంబీ) పరిధిలోకి తేవాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. పిటిషన్ ను జులై 9న విచారిస్తామని తెలిపింది. ఆలోపు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తమ అభ్యంతరాలను రాతపూర్వకంగా సమర్పించాలని ఆదేశించింది.

తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండా విద్యుత్‌‌ ఉత్పత్తి చేస్తోందంటూ 2021 ఏడాది మొదట్లో కేంద్రానికి ఫిర్యాదు చేసిన ఏపీ ప్రభుత్వం, అదే ఏడాది జులైలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సంబంధిత అథారిటీ అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం తమ పరిధిలోని విద్యుత్‌‌ కేంద్రాల నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తోందని ఆరోపించింది. దీనివల్ల ప్రాజెక్టుల నీటి వాటా వినియోగంలో తేడాలు వస్తున్నాయని పేర్కొంది.

ఈ పిటిషన్ పై గతంలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కేంద్రానికి, కేఆర్‌‌ఎంబీకి, తెలంగాణ ప్రభుత్వానికి, టీఎస్ జెన్‌‌కో సీఎండీకి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ మంగళవారం జస్టిస్‌‌ అభయ్‌‌ ఎస్‌‌ ఓఖా, జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భుయాన్‌‌తో కూడిన టూ మెంబర్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది.