గ్రూప్-1పై పిటిషన్లను డిస్మిస్‌‌‌‌ చేయండి..హైకోర్టులో క్వాలి ఫైడ్‌‌‌‌అభ్యర్థుల వాదన

గ్రూప్-1పై పిటిషన్లను డిస్మిస్‌‌‌‌ చేయండి..హైకోర్టులో క్వాలి ఫైడ్‌‌‌‌అభ్యర్థుల వాదన
  • గత 14 ఏండ్లుగా నియామకాలు లేవని ఆవేదన 

హైదరాబాద్, వెలుగు: గ్రూప్‌‌‌‌–1 పరీక్షలపై దాఖలైన పిటిషన్లు కొట్టేయాలంటూ హైకోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. పిటిషన్లు ప్రజాప్రయోజనాలకు విరుద్ధమని, గత 14 ఏండ్లుగా నియామకాలు జరగలేదని గ్రూప్ 1లో అర్హత సాధించిన అభ్యర్థుల తరపు న్యాయవాది లక్ష్మీనర్సింహ వాదించారు. ఉద్యోగాల కోసం అభ్యర్థులు చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారని అన్నారు. గ్రూప్‌‌‌‌ 1 పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌‌‌‌  నామవరపు రాజేశ్వరరావు శుక్రవారం కూడా వాదన లు కొనసాగించారు. 

గ్రూప్ 1 పరీక్షపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్లు వేసిన వాళ్లు ఎలా నష్టపోయారో చెప్పడం లేదని లక్ష్మీనర్సింహ పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి గ్రూప్‌‌‌‌ 1 పోస్టుల కోసం పరీక్షలు రాసిన వాళ్ల జీవితాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. గ్రూప్‌‌‌‌ 1 నోటిఫికేషన్‌‌‌‌పై గతంలో పిటిషన్‌‌‌‌  దాఖలు చేయగా హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు.

 దీంతో వాళ్లు సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయిందని, సుప్రీంకోర్టు కూడా జోక్యానికి నిరాకరించిందని గుర్తుచేశారు. పూజితా రెడ్డి అనే అభ్యర్థి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వల్ల వివాదం మొదలైందని చెప్పారు. టీజీపీఎస్సీ పారదర్శకంగానే పరీక్షలు నిర్వహించిందన్నారు. మొత్తం నియామక ప్రక్రియ చివరి దశకు వచ్చాక పరీక్షలను రద్దు చేయాలని కోరడం చట్టవ్యతిరేకమన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను ఈ నెల 7కు వాయిదా వేశారు.