
వినోద్ వర్మ, అనసూయ, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష ముఖ్యపాత్రల్లో ‘పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ తెరకెక్కించిన చిత్రం ‘అరి’. శ్రీనివాస్ రామిరెడ్డి, డి శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మించారు. ఈ నెల 10న సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ ‘నాకు ఉపేంద్ర గారి సినిమాలు ఇష్టం. కమర్షియల్‌గా ఉంటూనే ఒక మెసేజ్ ఉంటుంది. ఇది కూడా అలాంటి సినిమానే. మన పురాణాల్లో అరిషడ్వర్గాలను జయించాలని చెప్పారే కానీ ఎలా జయించాలో చెప్పలేదు.
దీనిపై సినిమా చేయాలని హిమాలయాలకు వెళ్లి, అక్కడి యోగులు చెప్పిన సూచనలతో పూర్తి సందేశాత్మకంగా కాకుండా ఎంటర్‌టైనింగ్‌గా దీన్ని తెరకెక్కించాను. సాధారణ ప్రేక్షకులకు కూడా సులువుగా అర్థమయ్యేలా తీయడం వల్ల చిత్రీకరణ కొంత ఆలస్యమైంది. ప్రధానంగా ఆరు పాత్రల చుట్టూ జరిగే కథ. ఆరుగురి నటన గుర్తుండిపోతుంది.
అలాగే వీఎఫ్‌ఎక్స్ ఆకర్షణగా నిలుస్తాయి. వెంకయ్య నాయుడు గారు ‘అరి’ సినిమా చూసి మోడరన్ భగవద్గీతలా ఉంది అన్నారు. అలాగే మల్లాది, యండమూరి, అశ్వనీదత్ లాంటి వాళ్లు చూసి అభినందించారు. ఇక జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లీడ్‌గా ఓ సినిమా చేయబోతున్నా. డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది’ అని చెప్పాడు.