ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన సచిన్ తనయుడు.. చండీగఢ్‌పై గోవా ఘన విజయం

ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన సచిన్ తనయుడు.. చండీగఢ్‌పై గోవా ఘన విజయం

కోల్‎కతా: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా చండీగఢ్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్‎లో రాణించి గోవాకు ఘన విజయాన్ని అందించాడు. బౌలింగ్‎లో మూడు కీలక వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‎లో ధనాధన్ ఇన్సింగ్స్‎ ఆడటంతో చండీగఢ్‌పై గోవా 52 పరుగుల తేడాతో గెలుపొందింది.

శుక్రవారం (నవంబర్ 28) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఈ  మ్యాచులో చండీగఢ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన గోవా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. లలిత్ యాదవ్ 82, దీప్రాజ్ గావోంకర్ 28, దర్శన్ మిసల్ 18, అర్జున్ టెండూల్కర్ 14 రన్స్ చేశారు. ఛండీఘడ్ బౌలర్లలో సందీప్ శర్మ, జగ్గిత్ సింగ్ చెరో రెండు వికెట్లు తీయగా.. రాహుల్ సింగ్ ఒక వికెట్ పడగొట్టాడు. 

అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఛంఢీఘడ్ గోవా బౌలర్ల ధాటికి 121 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది. అర్జున్ టెండూల్కర్, వాసుకి కౌశిక్, దర్శన్ మిసల్ తలో మూడు వికెట్ల తీసి ఛండీఘడ్‎ను కుప్పకూల్చారు. దీప్రాజ్ గోనాంకర్ ఒక వికెట్ సాధించాడు. ఛండీఘడ్ బ్యాటర్లలో రాజ్ బజ్వా 28, జగ్గిత్ సింగ్ 20, ధిండ్సా 19, గౌరవ్ పూరి 11, రాహుల్ సింగ్ 11 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‎కే పరిమితం కావడంతో ఛంఢీఘడ్ ఓటమి చవిచూసింది.