ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

అధికారులతో కలెక్టర్ల సమీక్ష

నిర్మల్,  ఆదిలాబాద్​టౌన్, వెలుగు:  అక్టోబర్ 16న జరిగే గ్రూప్  వన్  పరీక్ష  కోసం  పకడ్బందీ   ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్​, నిర్మల్​ కలెక్టర్లు సిక్తా పట్నాయక్​, ముషారఫ్ ఫారుఖీ  అధికారులను  ఆదేశించారు.  మంగళవారం ఆయా కలెక్టరేట్లలో ఏర్పాట్లను రివ్యూ చేశారు. ఆదిలాబాద్​లో  19 సెంటర్లు ఏర్పాటు చేశామని,  262 గదుల్లో  పరీక్షలు జరుగుతాయని సిక్తా పట్నాయక్​ తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే  6,200 మంది అభ్యర్థులకు అన్ని  సౌకర్యాలు కల్పించాలన్నారు.   సమావేశంలో అడిషనల్​ కలెక్టర్​ ఎన్​.నటరాజ్​, అడిషనల్​ ఎస్పీ శ్రీనివాస్​రావు, విద్యుత్​శాఖ ఎస్​ఈ ఉత్తమ్​, డీఈఓ ప్రణిత, డీఐఓ రవీందర్​, ఆయా శాఖల అధికారులు  పాల్గొన్నారు. నిర్మల్​  కలెక్టరేట్ లో  కళాశాల ప్రిన్సిపాల్ ల తో  కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ  సమీక్ష చేశారు.  జిల్లాలో  20  పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 4,498 మంది అభ్యర్థులు   పరీక్షలు  రాయనున్నారని వివరించారు. పరీక్ష కేంద్రాల్లో  సీసీ కెమెరాల  నిఘా ఉంటుందన్నారు.  ఈ  సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు హేమంత్ బోర్కాడే, రాంబాబు, డీఈఓ రవీందర్ రెడ్డి, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.

టెన్త్​ స్టూడెంట్లకు స్కూల్​ కిట్ల పంపిణీ

మోడీ బర్త్​డే సందర్భంగా సేవా కార్యక్రమాలు 

మంచిర్యాల, వెలుగు: ప్రధానమంత్రి నరేంద్రమోడీ బర్త్​డే సందర్భంగా 15 రోజులపాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు తెలిపారు. మంగళవారం హాజీపూర్ మండలం ముల్కల్ల, రాపల్లి గవర్నమెంట్​ స్కూళ్లకు చెందిన టెన్త్​ క్లాస్​ స్టూడెంట్లకు వెరబెల్లి ఫౌండేషన్​ ఆధ్వర్యంలో స్కూల్​ కిట్లు అందజేశారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా బ్లడ్​ డొనేషన్​, హెల్త్​ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. 10 జీపీఏ సాధించిన విద్యార్థులను తన ఖర్చులతో ఇంటర్మీడియెట్ చదివిస్తానని రఘునాథ్​రావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బొలిశెట్టి తిరుపతి, నాయకులు మోటపలుకుల తిరుపతి, బియ్యాల సతీశ్​  రావు, మడిపెల్లి సత్యం, బోయిని నరేశ్​, 
దామెరకుంట నర్సయ్య, హనుమాండ్ల శ్రీనివాస్, ఉట్నూరి శ్రీనివాస్, చౌతకారి రాకేశ్​, శ్రీకాంత్, మారుతి పాల్గొన్నారు. 

అక్టోబర్ 21న గోలేటిలో పబ్లిక్​ హియరింగ్

మందమర్రి/ఆసిఫాబాద్​,వెలుగు: బెల్లంపల్లి ఏరియాలో కొత్తగా ఏర్పాటు చే యనున్న  గోలేటి  ఓపెన్​కాస్ట్​ మైన్​ పై  పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి  మంగళవారం నోటిఫికేషన్​ జారీ చేసింది. కుమురంభీం ఆసిపాబాద్​ జిల్లా రెబ్బెన మండలం గోలేటి  గ్రామంలోని ఎంవీటీసీ వద్ద  అక్టోబర్​ 21న మధ్యాహ్నం ప్రజాభిప్రాయ సేకరణ   నిర్వహించనున్నారు.  గతంలో మూసివేసిన గోలేటీ1,1ఏ అండర్​ గ్రౌండ్​ మైన్లు, బెల్లంపల్లి ఓసీపీ 2 ఎక్స్​టెన్షన్​ మైన్​, అబ్బాపూర్​ ఓసీపీ ప్రాంతాలను కలిపి సింగరేణి యాజమాన్యం కొత్తగా  1358.280 హెక్టార్ల విస్తీర్ణంలో  గోలేటీ ఓసీపీగా ఏర్పాటు చేస్తోంది.    సింగరేణికి  594.071 హెక్టార్ల స్థలం ఉండగా 665.914 హెక్టార్ల భూమిని సేకరించనుంది. దీనికోసం సింగరేణి రూ.220 కోట్లు ఖర్చుచేయనుండగా..  ఏటా 3.5మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని టార్గెట్​పెట్టుకుంది.   గోలేటీ ఓసీపీ పరిధిలోకి  మంచిర్యాల జిల్లా తాండూర్​ మండలంలోని  అబ్బాపూర్​, బెజ్జాల, గంపాలపల్లి, నర్సాపూర్​, ఆసలమాడ , కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా రెబ్బెన మండలంలోని గోలేటి, సోనాపూర్​ గ్రామాలు వస్తాయి. ఓసీపీకి  మినిస్ట్రీ  ఆఫ్​ కోల్​ అండ్​ ఎన్విరాన్​మెంట్​ పర్మిషన్​ ఇచ్చింది.

హట్టికి చేరిన తుడుం దెబ్బ పాదయాత్ర

ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని డిమాండ్​

ఆసిఫాబాద్ ,వెలుగు : ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ అధ్వర్యంలో ఈనెల 15న  ప్రారంభించిన పాదయాత్ర మంగళవారం కెరమెరి మండలం హట్టికి చేరుకుంది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నాయని, తమ  సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కొట్నాక్ విజయ్ కుమార్ అన్నారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎస్టీ జాబితాలో లంబాడాలను చేర్చడంవల్ల  విద్య, ఉపాధి రంగాల్లో  ఆదివాసీలకు అన్యాయం జరుగుతోందన్నారు.   బుధవారం జోడేఘాట్లో  జరిగే సభను  సక్సెస్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉయిక సంజీవ్,  కార్యదర్శి కోడప  నగేశ్​, కుడుమేత తిరుపతి,సోయం జంగు తదితరులు పాల్గొన్నారు. 

సర్కారు కాలేజీల్లో నాణ్యమైన చదువు

నిర్మల్, వెలుగు:  రాష్ట్రంలోని  గవర్నమెంట్  డిగ్రీ  కాలేజీల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్  అందిస్తున్నామని , దీంతో అడ్మిషన్ల సంఖ్య బాగా  పెరుగుతోందని  కాలేజీ విద్య శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. రాజేందర్ సింగ్ తెలిపారు.  మంగ ళవారం  స్థానిక  గవర్నమెంట్  డిగ్రీ కాలేజీ ని ఆయన తనిఖీ చేశారు.  వచ్చే ఏడాది  నిర్మల్​ కాలేజీకి  నాక్  ఏ గ్రేడింగ్ సాధించేందుకు మరింత  శ్రమించాలన్నారు.  విద్యా ర్థులకు  నాణ్యమైన  విద్యతో బాటు  కాలేజీల్లో  అన్ని   సౌకర్యాలను సమకూర్చేందుకు కళాశాల  విద్య  కమిషనర్  నవీన్ మిట్టల్  చర్యలు తీసుకుంటున్నారన్నారు.  విద్యార్థుల లో దాగి ఉన్న నైపు ణ్యాలను  వెలికి  తీసేందుకు  ప్రత్యేక  కార్యక్రమాలు చేపడు తున్నట్లు చెప్పారు.  ప్రిన్సిపాల్ డాక్టర్ జే. భీమారావు, లెక్చరర్లు పాల్గొన్నారు.

ఆర్కే8 డిస్పెన్సరీలో  ‘స్వచ్ఛ ఆఫీస్​’ 

నస్పూర్, వెలుగు: ఆజాదీ కా అమృత్  మహోత్సవ్ లో  భాగంగా ఆర్కే8 డిస్పెన్సరీలో మంగళవారం స్వచ్ఛ ఆఫీస్ కార్యక్రమాన్ని  నిర్వహించారు. కార్యక్రమంలో  పాల్గొన్న శ్రీరాంపూర్ జీఎం సంజీవ రెడ్డి పరిసరాలను  శుభ్రం చేశారు. శ్రీరాంపూర్ ఏరియాలోని గనులు, డిపార్ట్​మెంట్‌లలో ఏడాదిపాటు అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన  తెలిపారు. అనంతరం ఆయన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.  ట్రైనింగ్ లో ఉన్న 30 మంది  యువకులు రక్తదానం చేశారు. ఉద్యోగులందరూ  రక్తదానం చేసి..  తోటి వారి ప్రాణాలను కాపాడాలని జీఎం సూచించారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ లీడర్ సురేందర్  రెడ్డి, శిక్షణా కేంద్రం  ఎస్ఓఎం కల్లూరి వెంకటరామారావు, డీవై సీఎంఓ డాక్టర్  రమేష్ బాబు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లోక్‌నాథ్ రెడ్డి పాల్గొన్నారు.

26 నుంచి బాసరలో దసరా ఉత్సవాలు

నిర్మల్, వెలుగు:  ఈనెల  26 నుంచి  అక్టోబర్  5 వరకు   బాసర జ్ఞాన సరస్వతి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇందుకోసం పెద్ద  ఎత్తున  ఏర్పాట్లు చేస్తామని   దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.  మంగళవారం ఆయన ఉత్సవాల పోస్టర్లను  ఆవిష్కరించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆయన ఆలయ అధికారులకు సూచించారు. 

చెన్నూరు బీజేపీ కన్వీనర్​గా రమేశ్

మందమర్రి,వెలుగు: చెన్నూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్​గా అక్కల రమేశ్ ను నియమించారు.  రామకృష్ణాపూర్​కు చెందిన  రమేశ్​  బీసీ మోర్చా డిస్ర్టిక్ట్​ వైస్​ ప్రెసిడెంట్​గా కొనసాగుతున్నారు. కన్వీనర్​ బాధ్యతలు అందుకున్న రమేశ్​ను మంగళవారం మందమర్రిలో బీజేపీ టౌన్​ప్రెసిడెంట్ సప్పిడి నరేశ్ ఆధ్వర్యంలో సన్మానించారు.  వచ్చే  ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా రమేశ్​ చెప్పారు.   తనకు పదవి అప్పగించిన బీజేపీ నేషనల్​ ఎగ్జిక్యూటివ్​ మెంబర్ ​, మాజీ ఎంపీ డాక్టర్​ వివేక్​ వెంకటస్వామి, బీజేపీ డిస్ట్రి క్ట్​ ప్రెసిడెంట్ వెరబెల్లి రఘునాథ్​రావు,  జనరల్​ సెక్రటరీ అందుగుల శ్రీనివాస్​కు ధన్యవాదాలు తెలిపారు.  కార్యక్రమంలో బీజేపీ   లీడర్లు రాంటెంకి దుర్గారాజు, కొంతం రాజు,రవిసాగర్​,    అల్లంల నగేశ్​, గడ్డం శ్రీనివాస్​, గొల్లపల్లిఓదెలు,    ఓరుగంటి సురేందర్,   లాటుకురి సందీప్,  కర్రావుల శ్యాం బాబు,  రంజిత్,  ఉదయ్,  స్వామి సాయి చరణ్,  రాకేశ్​ తదితరులు పాల్గొన్నారు.  

కాంట్రాక్ట్​ కార్మికుల ర్యాలీ, రాస్తారోకో

మందమర్రి, బెల్లంపల్లిలో అర్ధనగ్న ప్రదర్శన 

మందమర్రి/ నస్పూర్/ బెల్లంపల్లి​,వెలుగు: కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ సోమవారం పలుచోట్ల కార్మికులు ఆర్ధనగ్న ప్రదర్శన చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చేంతవరకూ సమ్మె కొనసాగుతుందని జేఏసీ లీడర్లు స్పష్టం చేశారు.  మందమర్రి మార్కెట్ ప్రాంతంలో  ఆర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి..  గోదావరిఖని కోల్​బెల్ట్​రోడ్డుపై   రాస్తారోకో చేశారు. కార్మికులకు  టీడీపీ నేత  బి.సంజయ్​కుమార్ మద్దతు తెలిపారు.  చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్​ కాంట్రాక్ట్​ కార్మికుల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. శ్రీరాంపూర్​ ఏరియా ఎస్సార్పీ ఓసీపీలో డంపర్లను అడ్డుకోవడానికి  ర్యాలీగా బయలుదేరిన  
కార్మికులను  పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఆందోళనలో  సీపీఎం జిల్లా సెక్రటరీ సంకె రవి, కార్మిక సంఘాల జేఏసీ లీడర్లు దూలం శ్రీనివాస్​, ఎండీ జఫర్​, జెట్టి మల్లయ్య, డి.బ్రహ్మనందం పాల్గొన్నారు.  బెల్లంపల్లిలోనూ  కాంట్రాక్ట్ కార్మికులు అర్థనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. బెల్లంపల్లి సివిక్ ఆఫీస్ నుంచి  అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్ టీయు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎండి. చాంద్ పాషా, ఏఐసీటీయు బెల్లంపల్లి ఏరియా అధ్యక్షుడు ఎల్తూరి  శంకర్,హెచ్ ఎంఎస్ సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండ్ర  శంకరయ్య, బీఎల్ పీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ కన్నూరి సమ్మయ్య మాట్లాడారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులు 12 రోజులుగా సమ్మె చేస్తున్న సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం పట్టించుకోకపోవడం తగదన్నారు.  ఈ కార్యక్రమంలో జేఏసీ లీడర్లు  పాల్గొన్నారు.

ఆలయ ముఖద్వారం నిర్మించాలని  రాస్తారోకో

బెల్లంపల్లి, వెలుగు :  బుగ్గ రాజరాజేశ్వర దేవస్థానం ముఖద్వారాన్ని  నేషనల్ హైవే కాంట్రాక్టర్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బెల్లంపల్లిలోని చంద్రాపూర్, హైదరాబాద్ నేషనల్​ హైవేపై స్థానికులు రాస్తారోకో చేశారు.   రోడ్డుపై బైఠాయించి  కంకర లారీలు,  జేసీబీలను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. ఫోర్ వే పనులలో భాగంగా మట్టి తేవడానికి వెళ్తున్న లారీలు తగిలి ఆలయ ముఖ ద్వారం పగిలిపోయిందని, దాన్ని తిరిగి నిర్మిస్తామని కాంట్రాక్టర్ చంద్రశేఖర్  హామీ  ఇచ్చాడని  కాంగ్రెస్​ఓబీసీ సెల్​ వైస్ చైర్మన్ బండి ప్రభాకర్ యాదవ్, ఏఎంసీ మాజీ చైర్మన్ సిలివేరి నర్సింగం   తెలిపారు.  10 నెలలు గడుస్తున్నా ముఖద్వారాన్ని కట్టలేదన్నారు.  పోలీసులు అక్కడకు చేరుకుని  వెంటనే పనులు ప్రారంభిస్తామని కాంట్రాక్టర్ తో రాతపూర్వకంగా హామీ ఇప్పించడంతో రాస్తారోకో విరమించారు.