- మాస్క్లు పెట్టుకుని వచ్చిన ఆరుగురు దుండగులు
- లాకర్ ‘కీ’ ఇవ్వాలని గన్తో బెదిరింపు
- తాళం లేదన్న డిప్యూటీ మేనేజర్పై కాల్పులు
- తొడలోకి దూసుకెళ్లిన బుల్లెట్.. హాస్పిటల్కు తరలింపు
- వెండి వస్తువులు దోచుకుని సంగారెడ్డి వైపు పరార్
- రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి
చందానగర్, వెలుగు: హైదరాబాద్ చందానగర్‌లోని ఖజానా జ్యువెలర్స్లో దుండగులు దోపిడీకి పాల్పడ్దారు. మంగళవారం ఉదయం షాపు తెరవగానే మాస్కులు పెట్టుకుని లోపలికి చొచ్చుకొచ్చిన ఆరుగురు దుండగులు.. గోల్డ్ భద్రపరిచే లాకర్ కీ ఇవ్వాలని డిప్యూటీ మేనేజర్‌ను బెదిరించారు. తాళం తన దగ్గర లేదనడంతో కాల్పులు జరిపారు. కొందరు దుండగులు కింద ఉండగా.. మరికొందరు ఫస్ట్ ఫ్లోర్‌కు వెళ్లి డిస్ప్లేలో ఉన్న వెండి ఆభరణాలను తమతో తీసుకొచ్చిన బ్యాగుల్లో వేసుకున్నారు.
10 నిమిషాల్లో దొరికిందంతా దోచుకుని 2 బైక్‌లపై అక్కడి నుంచి ఉడాయించారు. దోపిడీకి సంబంధించిన ఘటన సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. వీరు జహీరాబాద్ వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. దుండగుల కోసం 10 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఘటనా స్థలాన్ని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, మాదాపూర్ డీసీపీ వినీత్, మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ ఘటనలో డిప్యూటీ మేనేజర్ ఎడమ కాలి తొడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అతన్ని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
నేషనల్ హైవే పక్కనే జ్యువెలరీ షాపు
చందానగర్ గంగారంలో ముంబై హైవే పక్కన ఖజానా జ్యువెలర్స్ షాప్ ఉంది. మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో జ్యువెలరీ షాపులో పని చేసే దాదాపు 25 మంది సిబ్బందికి మీటింగ్ జరుగుతున్నది. 10.35కు కొందరు యువకులు మాస్క్లు పెట్టుకుని షాపులోకి చొరబడ్డారు. లోపలికి వచ్చిన వెంటనే సిబ్బందిని గన్లతో భయపెట్టారు. మీటింగ్‌లో ఉన్న డిప్యూటీ మేనేజర్ సతీశ్‌ను గోల్డ్ భద్రపరిచే లాకర్ కీ ఇవ్వాలని బెదిరించారు. తన వద్ద లాకర్ కీ లేదనడంతో ఓ దుండగుడు సతీశ్‌పై కాల్పులు జరిపాడు.
ఒక బుల్లెట్ అతని ఎడమ కాలి తోడలోకి దూసుకెళ్లింది. తర్వాత ముగ్గురు దుండగులు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండగా.. మరో ముగ్గురు ఫస్ట్ ఫ్లోర్‌కు వెళ్లారు. అక్కడి డిస్ ప్లేలను పగులగొట్టి వెండి వస్తువులను తమ వెంట తెచ్చుకున్న బ్యాగుల్లో నింపుకొని, అక్కడి నుంచి బైక్‌లపై పారిపోయారు. షాపు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్స్ ఆధారాలు సేకరించింది. దొంగతనం, డెకాయిటీ, ఆర్మ్ యాక్ట్, హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.
ప్రత్యేక బృందాలతో దుండగుల కోసం గాలిస్తున్నాం: సీపీ అవినాశ్ మహంతి
దుండగులను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించాక మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘ఆరుగురు దుండగులు బైక్‌పై వచ్చి ఖజానా జ్యువెలర్స్లో దోపిడీకి పాల్పడ్డారు. ముగ్గురు లేదా నలుగురి వద్ద గన్లు ఉన్నాయి. 2 రౌండ్ల కాల్పుల్లో డిప్యూటీ మేనేజర్ సతీశ్‌కు గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో 2 ఖాళీ క్యాట్రిడ్జ్‌లు దొరికాయి. షాపులో దుండగులు 10 నిమిషాలు ఉన్నారు. వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. ఎంత మొత్తంలో చోరీ జరిగిందనేది స్పష్టత రాలేదు.
సరిహద్దు జిల్లాల పోలీసులను అప్రమత్తం చేశాం. నిందితులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అనేదానిపై దర్యాప్తు చేస్తున్నాం. ఐదుగురు తమ ముఖాలకు మాస్క్లు పెట్టుకున్నారు. మరొకడు హెల్మెట్ ధరించాడు. 2 బైక్‌లపై ఆరుగురు దుండగులు చందానగర్ నుంచి బీహెచ్ఈఎల్ ఫ్లై ఓవర్ మీదుగా సంగారెడ్డి వైపు వెళ్లారు. దుండగులంతా 30 ఏండ్లలోపే ఉండొచ్చు. బిహార్ లేదంటే యూపీకి చెందిన గ్యాంగ్‌గా అనుమానిస్తున్నాం’’అని అవినాశ్ మహంతి తెలిపారు.
తాళాలు మరిచిపోవడంతో తప్పిన భారీ దోపిడీ
మంగళవారం ఉదయం జ్యువెలరీ షాప్ ఓపెన్ చేశారు. గోల్డ్ భద్రపరిచే లాకర్ కీ తీసుకురావడం మేనేజర్ మరిచిపోయాడు. దీంతో అతను కీ తీసుకురావడానికి బయటికి వెళ్లాడని సిబ్బంది ద్వారా తెలిసింది. ఈ లోపే దుండగులు షాప్‌లోకి ప్రవేశించి కీ కోసం డిప్యూటీ మేనేజర్‌ను బెదిరించారు. ఒక వేళ మేనేజర్ కీ మరిచిపోకుండా తీసుకొచ్చి షాపులోనే ఉంటే లాకర్లోని బంగారం మొత్తం దుండగులు ఎత్తుకెళ్లేవారు. కీ మరిచిపోవడంతోనే భారీ దోపిడీ తప్పిందని సిబ్బంది చెప్తున్నారు.
