
- విజయవంతంగా పూర్తయిన దరఖాస్తు ప్రక్రియ
హైదరాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పసుపు.. జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపు కోసం ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. ఆర్మూర్ పసుపు కోసం జీఐ రిజిస్ట్రేషన్ దరఖాస్తు (నంబర్ 1624) ను చెన్నైలోని జీఐ రిజిస్ట్రీకి సమర్పించగా.. శుక్రవారం రిజిస్ట్రేషన్ పూర్తయింది. త్వరలోనే జీఐ గుర్తింపు రానుంది. ఈ దరఖాస్తును ఆర్మూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, మంథని ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ పేరిట దాఖలు చేశారు. హార్టికల్చర్ వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ పిడిగాం సైదయ్య ఈ ప్రాజెక్టుకు నాబార్డ్ మద్దతుతో ప్రధాన పరిశోధకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఆర్మూర్ పసుపు ఆవిర్భావ మూలం, రకాల లక్షణాలు, జీవరసాయన ప్రొఫైలింగ్, రైతుల సాగు పద్ధతులు, డీఎన్ఏ ట్యాగింగ్, నిజామాబాద్ జిల్లాతో దాని భౌగోళిక సంబంధం వంటి కీలక అంశాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించారు. ఈ ప్రక్రియలో ‘జీఐ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలువబడే డాక్టర్ రజనీకాంత్.. హ్యూమన్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా, రైతుల తరపున జీఐ టెక్నికల్ ఫెసిలిటేటర్‌గా వ్యవహరించి దరఖాస్తు సమర్పణలో కీలక పాత్ర పోషించారు.
కాగా, ఆర్మూర్ పసుపు జీఐ కోసం దరఖాస్తు చేసుకున్న ఏడో పసుపు రకంగా నిలిచింది. ఇప్పటికే ఈరోడ్ మంజల్, వైగావ్ పసుపు, సాంగ్లి పసుపు, లకాడాంగ్ పసుపు, వాస్మత్ హల్ది వంటి రకాలకు జీఐ ట్యాగ్ మంజూరైంది. జార్ఖండ్‌లోని సెరైకేలా-ఖర్సావన్ జిల్లాకు చెందిన ఖర్సావన్ పసుపు దరఖాస్తు ప్రస్తుతం ముందస్తు పరీక్షలో ఉంది.
గేమ్ చేంజర్
తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ దండ రాజిరెడ్డి మాట్లాడుతూ.. “జీఐ రిజిస్ట్రేషన్ ఆర్మూర్ పసుపు రైతులకు గేమ్- చేంజర్‌గా నిలుస్తుంది. ఇది ప్రీమియం ధరలు, మెరుగైన మార్కెట్ అవకాశాలు, ఎగుమతి సామర్థ్యాన్ని పెంచుతుంది. జీఐ ట్యాగ్‌తో ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలు ఉన్నతంగా ఉండటంతో రైతులు అధిక ఆదాయం పొందగలుగుతారు” అని పేర్కొన్నారు.
మరో 15 పంటలకు సంబంధించి ఫీల్డ్ రిసెర్చ్, రైతులతో చర్చల తర్వాత జీఐ దరఖాస్తులు సమర్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. నాబార్డ్ సీజీఎం కె. ఉదయ భాస్కర్ మాట్లాడుతూ.. “జీఐ ట్యాగ్ ఇంటర్నేషనల్ గుర్తింపును పెంచడంతో పాటు, ఎక్స్పోర్ట్ అవకాశాలను మెరుగుపరుస్తుంది. ఇది నిజమైన ఉత్పత్తిదారులకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుంది. అందుకే ఈ ప్రాజెక్టుకు ఆర్థిక మద్దతు అందించాం” అని తెలిపారు. నాబార్డ్ జిల్లా అభివృద్ధి మేనేజర్ ఎస్. ప్రవీణ్ కుమార్.. ఈ ప్రాజెక్టుకు సహకరించిన బృందంతో కలిసి పనిచేశారు. ప్రాజెక్టు ప్రధాన పరిశోధకుడు డాక్టర్ సైదయ్య మాట్లాడుతూ.. “జీఐ రక్షణ స్వదేశీ పంటల సాగును ప్రోత్సహిస్తుంది. జీవవైవిధ్య సంరక్షణకు దోహదపడుతుంది” అని తెలిపారు.