సైన్యానికి ఫ్రీ హ్యాండ్ అన్న మోడీ.. వెంట‌నే చైనా స‌రిహ‌ద్దుల్లో రూల్స్ మార్చిన భార‌త ఆర్మీ

సైన్యానికి ఫ్రీ హ్యాండ్ అన్న మోడీ.. వెంట‌నే చైనా స‌రిహ‌ద్దుల్లో రూల్స్ మార్చిన భార‌త ఆర్మీ

భార‌త్ – చైనా స‌రిహ‌ద్దుల్లో గాల్వ‌న్ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మ‌ధ్య హింసాత్మ‌క ఘ‌ర్ష‌ణ త‌ర్వాత భార‌త ఆర్మీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. చైనా స‌రిహ‌ద్దుల్లోని వాస్త‌వాధీన రేఖ వెంట ప‌హారా కాస్తున్న సైనికులు వ్య‌వ‌హ‌రించాల్సిన తీరుపై గ‌తంలో ఉన్న రూల్స్‌లో మార్పులు చేసింది. చైనా స‌రిహ‌ద్దుల్లో వాస్త‌వాధీన రేఖ వెంట అనుకోని ప‌రిస్థితులు త‌లెత్తినప్పుడు తుపాకులకు ప‌ని చెప్పొచ్చ‌ని నిబంధ‌న‌ల్లో స‌డ‌లింపు చేసిన‌ట్లు ఆర్మీ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ఏదైనా అసాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్న స‌మ‌యంలో వెంట‌నే ఫీల్డ్‌లోని క‌మాండర్ స్థాయి అధికారి స్వేచ్ఛ‌గా నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌ని రూల్‌ను స‌వ‌రించింది.

చైనా స‌రిహ‌ద్దుల్లో వాస్త‌వాధీన రేఖ వెంట రెండు కిలోమీట‌ర్ల మేర అటూ ఇటూ రెండు దేశాల సైనికులూ తుపాకుల‌తో కాల్పులు జ‌ర‌ప‌డం కానీ, బాంబులు లాంటివి పేల్చడం కానీ చేయ‌కూడ‌ద‌ని 1996 – 2005 మ‌ధ్య కొన్ని ఒప్పందాలు జ‌రిగాయి. ఈ ఒప్పందాల‌కు అనుగుణంగా భార‌త ఆర్మీ ఆ ప్రాంతంలో ఎటువంటి ప‌రిస్థితుల్లోనూ కాల్పుల‌కు దిగ‌కుండా సంయ‌మ‌నం పాటిస్తూ వ‌స్తోంది. ఎప్పుడైనా చైనా సైనిక‌లు మ‌న భూభాగంలోకి చొచ్చుకుని వ‌చ్చినా.. తుపాకుల‌తో కాల్పుల‌కు పాల్ప‌డ‌డం లాంటివి చేయ‌కుండా, ఎదురుగా నిలిచి వాళ్ల‌ను వెన‌క్కి వెళ్లాల‌ని సూచించ‌డం, చేతుల‌తో తోస్తూ వాస్త‌వాధీన రేఖ అవ‌త‌లికి నెట్ట‌డం వంటివి చేసేవారు. ఈ క్ర‌మంలోనే చైనా సైనికులు ఇటీవ‌ల గాల్వ‌న్ లోయ ప్రాంతంలోకి వ‌చ్చి టెంట్లు వేసినా వారిని వెన‌క్కి త‌రిమేందుకు ఆయుధాలు వాడ‌లేదు. నిబంధ‌న‌ల‌కు క‌ట్టుబ‌డిన మ‌న ఆర్మీ వీర జ‌వాన్ల‌ను చైనా ఇనుప రాడ్లు, రాళ్ల‌తో దాడికి దిగింది.

ఈ ఘ‌ట‌న‌లో క‌ల్న‌ల్ సంతోష్ బాబు స‌హా 20 మంది సైనికులు అమ‌రులయ్యారు. ఇదే స‌మ‌యంలో మ‌న సైనికులు కూడా చైనా దాడిని తీవ్రంగా ప్ర‌తిఘ‌టించారు. మ‌న సైనికులు ధాటికి చైనా ఆర్మీలో సుమారు 40 మందికి పైగా మ‌ర‌ణించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే దీనిపై చైనా క్లారిటీ ఇవ్వ‌లేదు. త‌మ సైన్యంలోనూ మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌ని చెప్పిన డ్రాగ‌న్ కంట్రీ ఎంత మంది మ‌ర‌ణించార‌న్న విష‌యం మాత్రం వెల్ల‌డించ‌లేదు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స్పందిస్తూ.. భార‌త్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంద‌ని, అయితే ఎవ‌రైనా రెచ్చ‌గొడితే స‌హించేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. చైనా స‌రిహ‌ద్దుల్లో సైనికుల‌కు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామ‌ని, ఎటువంటి ప‌రిస్థితుల్లోనై ఫ్రీ హ్యాండ్‌తో రెస్పాండ్ అవ్వొచ్చ‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో మ‌న ఆర్మీ రూల్స్ మార్పు చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.