హెయిర్ క్లిప్, కత్తితో రైల్వే ప్లాట్ ఫామ్ పైనే ప్రసవం.. ఆడబిడ్డకు ప్రాణం పోసిన ఆర్మీ డాక్టర్..

హెయిర్ క్లిప్, కత్తితో రైల్వే ప్లాట్ ఫామ్ పైనే ప్రసవం.. ఆడబిడ్డకు ప్రాణం పోసిన ఆర్మీ డాక్టర్..

వైద్యో నారాయణో హరి అనే నానుడిని నిజం చేస్తూ ఓ డాక్టర్ రైల్వే ప్లాట్ ఫారంపైనే ప్రసవం చేసి.. బిడ్డకు ప్రాణం పోశారు ఓ ఆర్మీ డాక్టర్. హెయిర్ క్లిప్, చిన్న కత్తెర సాయంతో డెలివరీ చేసి ఓ ఆడబిడ్డకు ప్రాణం పోశారు. శనివారం ( జులై 5 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. పన్వేల్ - గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న ఓ గర్భిణికి ప్రసవ నొప్పులు రావడంతో ఘాన్సీ స్టేషన్లో దింపేశారు రైల్వే అధికారులు. ఈ క్రమంలో గర్భిణి ప్రసవ వేదన గమనించిన రైల్వే స్టేషన్ సిబ్బంది అక్కడే రైలు కోసం వేచి ఉన్న ఆర్మీ డాక్టర్ కు సమాచారం అందించారు.

ఆర్మీ మెడికల్ కార్ప్స్ లో వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రోహిత్ బచ్ వాలా చాకచక్యంగా వ్యవహరించి ఆమెకు ప్రసవం చేసి... ఆడబిడ్డకు ప్రాణం పోశారు. సరైన ఆపరేషన్ థియేటర్ అందుబాటులో లేకపోవడంతో తన దగ్గర ఉన్న పరికరాలతోనే ప్రసవం చేయాల్సి వచ్చిందని తెలిపారు డాక్టర్. బొడ్డు తాడును బిగించడానికి, నేను హెయిర్ క్లిప్‌ను ఉపయోగించానని... బిడ్డ స్థిరంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత పాకెట్ కత్తితో దానిని కట్ చేశానని తెలిపారు. 

తల్లి, బిడ్డ డేంజర్ లో ఉన్నప్పుడు ప్రతి సెకను కీలకమైనవి అని అన్నారు డాక్టర్ రోహిత్. లిఫ్ట్ దగ్గర ప్రసవ వేదన అనుభవిస్తున్న మహిళను చూశానని..  తీవ్రమైన ప్రసవ నొప్పి కారణంగా ఆమె సొమ్మసిల్లిందని అన్నారు. ఆమె పరిస్థితి చూసిన వెంటనే అప్రమత్తమై తాత్కాలిక లేబర్ రూమ్ సృష్టించానని అన్నారు డాక్టర్. అందుబాటులో ఉన్న సామగ్రితో పరిసరాలు శుభ్రపరిచామని తెలిపారు. ఆ సమయంలో తాను అక్కడ ఉండటం దైవ నిర్ణయమని అన్నారు. 

ప్రసవం తర్వాత, తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారని.. ప్రస్తుతం ఇద్దరు సురక్షితంగా ఉన్నట్లు రైల్వే సిబ్బంది తెలిపారు.