అస్సాం రైఫిల్స్ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర: ఆర్మీ

అస్సాం రైఫిల్స్ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర: ఆర్మీ

ఇంఫాల్: మణిపూర్ లో శాంతిని నెలకొల్పేందుకు శ్రమిస్తున్న అస్సాం రైఫిల్స్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆర్మీ పేర్కొంది. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరగకుండా కఠిన చర్యలు కొనసాగిస్తామని తెలిపింది. ఈ మేరకు ఆర్మీ స్పియర్ కార్ప్స్ ట్విట్టర్ లో పోస్టు పెట్టింది. ‘‘మణిపూర్ లో శాంతి నెలకొల్పేందుకు మే 3 నుంచి నిరంతరాయంగా పని చేస్తున్న కేంద్ర బలగాలు, ముఖ్యంగా అస్సాం రైఫిల్స్ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

మణిపూర్​లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ పని చేస్తున్న భద్రతా బలగాల మధ్య విభేదాలు వస్తుంటాయి. వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో హింసను ఆపేందుకు ప్రయత్నిస్తున్నాం” అని పేర్కొంది. హెడ్ క్వార్టర్స్ ఆదేశాలతోనే  బఫర్ జోన్ రూల్స్​ను అస్సాం రైఫిల్స్ కఠినంగా అమలు చేసిందని తెలిపింది. కాగా, స్థానికుల ఆందోళనతో బిష్ణుపూర్ నుంచి అస్సాం  రైఫిల్స్​ను ప్రభుత్వం ఉపసంహరించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే అస్సాం రైఫిల్స్ పై పోలీసులు కేసు పెట్టారు.